తెలంగాణలో ఇంటర్ బోర్డు నిర్వాకంపై ఇప్పటి వరకు విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తు వచ్చారు.  తాజాగా ఇప్పుడు  వివిధ పార్టీ రాజకీయ నాయకులు ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారు.  నిన్న బీజేపీ నేతలు కలెక్టరేట్లు ముట్టడించారు..ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవక తవకలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు ఉదృతం చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరిగింది.


వరంగల్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ మహిళా నాయకురాలు విజయశాంతి నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి.  విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని విజయశాంతి మండిపడ్డారు. 20 మంది విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదని, విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు.   ఈ సందర్భంగా కేసీఆర్‌కు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. 


ఇంటర్ ఫలితాలలో అవకతవకలు జరిగి 5 రోజులు గడిచినా దొర మాత్రం ఎమ్మెల్యేలను కొనే బిజిలో ఉన్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండి పడ్డారు.  ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై తేల్చకపోతే... సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని విజయశాంతి  స్పష్టం చేశారు. ధర్నా కార్యక్రమం సందర్భంగా పోలీసులు విజయశాంతిని అరెస్ట్ చేశారు... దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.   ఆమెతో పాటు జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండేటి శ్రీధర్‌లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: