గ‌త కొద్దికాలంగా సాగుతున్న ఉత్కంఠ‌కు కాంగ్రెస్ పార్టీ తెర‌దించిన సంగ‌తి తెలిసిందే. వారణాసి నుంచి ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని వార్తలు షికారు చేయ‌గా...2014 ఎన్నికల్లో మోదీపై పోటీ చేసిన అజయ్‌ రాయ్‌నే మరోసారి కాంగ్రెస్‌ పార్టీ బరిలోకి దింపింది. కేరళలో ప్రియాంకా గాంధీని వారణాసి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా..పార్టీ అధ్యక్షుడు పోటీ చేయాలని నన్ను కోరితే..తప్పకుండా సంతోషంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. అయిన‌ప్ప‌టికీ, తిరిగి రాయ్‌కే అవ‌కాశం ఇవ్వ‌డం, ప్రియాంక‌కు నో చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.


రాజ‌కీయ విశ్లేష‌కుల స‌మాచారం ప్ర‌కారం, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసి నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా అజ‌య్ రాయ్ పోటీ చేయ‌డం పూర్తిగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని తెలుస్తోంది. ప్రియాంక పోటీ చేయాల‌ని ఆస‌క్తి చూపిన‌ప్ప‌టికీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాత్రం ప్రియాంక‌ను పోటీ చేసే విష‌యంపై ఆస‌క్తి చూప‌లేదని తెలుస్తోంది. రాహుల్ ప్ర‌స్తుతం రెండు స్థానాల నుంచి పోటీ చేస్తుండ‌టమే ఇందుకు కార‌ణం. రాబోయే కాలంలోని ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. 


రాహుల్‌గాంధీ ఉత్త‌రప్ర‌దేశ్‌లోని అమేథీతో పాటు కేర‌ళ‌లోని వాయ‌నాడ్‌లో పోటీ చేస్తున్నారు. ఈ రెండు చోట్ల ఆయ‌న గెలిచాక అమేథీని వ‌ద‌లుకుని వాయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తార‌న్న ప్ర‌చారం  జ‌రుగుతోంది. రాహుల్ రాజీనామా వ‌ల్ల అమేథీలో ఉప ఎన్నికలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీంతో త‌మ ఇలాకా అయిన అమేథీ నుంచి ప్రియాంక‌ను బ‌రిలో దించే ఉద్దేశంతో ఈ ఎన్నిక‌ల్లో పోటీకి నిల‌ప‌డం లేద‌ని తెలుస్తోంది. దీంతో పాటుగా ఒక‌వేళ ప్ర‌ధాన‌మంత్రి చేతిలో ఓడిపోతే అది సైతం ప్రియాంక పొలిటిక‌ల్ కెరీర్‌ను తీ్వ‌రంగా దెబ్బ‌తీస్తుంద‌ని భావించిన ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: