ఫోన్ కాల్ వస్తే చాలు అభ్యర్ధులు వణికిపోతున్నారట. ఎందుకయ్యా అంటే ఫోన్ లో మాట్లాడుతున్న వాళ్ళు అభ్యర్ధులు ఎన్నికల్లో పెట్టిన ఖర్చులు, ఓటుకు ఎంత సమర్పించుకున్నది తదితరాలను అడుతున్నారట. దాంతో ఫోన్ రింగయినపుడల్లా కొందరు అభ్యర్ధులు ఉలికిపడుతున్నారు. ఈ ఫోన్ సమస్య ప్రస్తుతానికి ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ’అన్నా పోలింగ్ బాగా జరిగిందా ....గెలుపు మనదే కదా అంటూ మొదలుపెట్టి చివరకు మొత్తం ఖర్చు ఎంతైందని ఓటుకు ఎంతిచ్చారంటూ‘ అడుగుతున్నారట. ఎవరో మనకు బాగా తెలిసిన వాళ్ళే మాట్లాడుతున్నారని అనుకున్న అభ్యర్ధులు చివరకు ఖర్చులు, ఓటుకు నోటు వివరాలు అడుగుతుండటంతో భయపడిపోతున్నారు. సమాధానం చెప్పకుండానే ఫోన్ కట్ చేస్తున్నారు. ఎక్కడి నుండి ఫోన్ వచ్చిందా అని ఆరా తీస్తే ట్రూ కాలర్ లో అన్ నోన్ నెంబర్ అనో లేకపోతే హైదరాబాద్ అనో కనిపిస్తోందట.

 

నంద్యాల పార్లమెంటు స్ధానంలోని అసెంబ్లీ అభ్యర్ధులు నలుగురికి ఈ తరహా ఫోన్లు వచ్చాయట. సోషల్ మీడియాకు చెందిన ఆకతాయిల పనో లేకపోతే యూ ట్యూట్ ఛానెళ్ళు అవీ కాకపోతే ఈ మధ్య చాలా చానెళ్ళు పుట్టుకొచ్చాయి. తమ ఛానెల్ ను పాపులర్ చేసుకోవటానికి ఇటువంటి చీప్ ట్రిక్స్ ఏమైనా ప్లే చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది అభ్యర్ధులకు.

 

ఎందుకంటే, ఇపుడు ప్రతీ స్మార్ట్ ఫోన్లోను రికార్డింగ్ సదుపాయం ఉంటోంది. అవతలి వాళ్ళకు ఫోన్ చేయటం ప్రతీ సంభాషణను రికార్డ్ చేస్తున్నారు. తమ సంభాషణలో ఏమైనా సంచలనాత్మక విషయాలుంటే వెంటనే టిఆర్పి రేటింగ్ పెంచుకునేందుకు వాటిని ఉపయోగించుకుంటున్నారు. అందుకనే కర్నూలు జిల్లాలో ఎవరి దగ్గర నుండి ఫోన్ వచ్చిందన్నా అభ్యర్ధులు వణికిపోతున్నారట. ఫోన్ చేసిందెవరూ తెలిస్తే సరి లేకపోతే మాట్లాడటానికే భయపడుతున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: