అవును కౌంటింగ్ కు ముందే టిడిపి నేతలే ఒప్పేసుకుంటున్నారు. ఫలితంగా ఓ పార్లమెంటు సీటు వైసిపి ఖాతాలో పడినట్లే అనిపిస్తోంది. ఈ విషయాన్ని వైసిపి నేతలు చెప్పటం కాదు. స్వయంగా తెలుగుదేశంపార్టీనే ఒప్పేసుకుంటోంది. ఇంతకీ ఆ ఎంపి సీటేదో ఈపాటికే అర్ధమై ఉంటుంది. అదేనండి విశాఖపట్నం పార్లమెంటు సీటు.

 

టిడిపి అభ్యర్ధిగా శ్రీ భరత్ ఇక్కడి నుండి పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. భరత్ అంటే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడే. అంటే స్వయానా నారా లోకేష్ తోడల్లుడు. భరత్ కు టికెట్ రావటమే నాటకీయ పరిణామాల మధ్య వచ్చింది. భరత్ కు టికెట్ ఇవ్వటం చంద్రబాబునాయుడుకు ఏమాత్రం ఇష్టం లేదని పార్టీ వర్గాలే చెప్పాయి. అయితే మామగారిని ప్రయోగించటం ద్వారా  చంద్రబాబును ఒత్తిడిలోకి నెట్టి భరత్ టికెట్ సాధించుకున్నారట.

 

భరత్ కు తప్పని పరిస్ధితిలో  టికెట్ ఇచ్చిన  చంద్రబాబు మరోవైపు టిడిపి ఓట్లను భరత్ కు కాకుండా జనసేన అభ్యర్ధి జేడి లక్ష్మీనారాయణకు వేయాల్సిందిగా లోపాయికారీగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి ఓట్లు జనసేనకు క్రాస్ అయినట్లు అర్ధమవుతోంది. అయితే ఎన్ని ఓట్లు క్రాస్ అయ్యాయి అన్నదే ప్రశ్న.

 

జనసేనకు ఓట్లు వేయమని నేతలు చెప్పినంత మాత్రాన ఎన్ని ఓట్లు జనసేనకు క్రాస్ అయ్యుంటాయన్నదే అర్ధం కావటం లేదు. అదే సమయంలో వైసిపి అభ్యర్ధి సత్యనారాయణ కూడా బలమైన అభ్యర్ధే. పైగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపి బలమైన అభ్యర్ధులను పోటీలోకి దింపింది. 

 

ఈ పార్లమెంటు పరిధిలో నగరంలోని తూర్పు, పశ్చిమం, ఉత్తరం, ధక్షిణం నియోజకవర్గాలతో పాటు గాజువాక, భీమిలి, విజయనగరం జిల్లాలోని ఎస్ కోట ఉన్నాయి. ఆరు నియోజకవర్గాల్లో టిడిపి, వైసిపి బలా బలాలు  కాస్త అటు ఇటుగా ఉన్నా బీమిలీ నియోజకవర్గంలో మాత్రం మంచి మెజారిటీ వస్తుందని వైసిపి లెక్కేసుకుంటోంది. సరే వైసిపి ఖాతాలో విశాఖపట్నం ఎంపి సీటు పడుతుందా పడదా అన్న విషయాన్ని పక్కనపెడితే  టిడిపికి మాత్రం మూడో స్ధానం ఖాయమే అని అర్ధమవుతోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: