ఏపీలో ఈసారి అలాంటి ఇలాంటి ఎన్నికలు జరగలేదుగా. ఆ విషయం రాజకీయ నాయకులే ఇపుడు బయటపెట్టుకుంటున్నారంటేనే పరిస్థితి ఎలా మారిందో అర్ధం చేసుకోవచ్చు. నిన్నటికి నిన్న టీడీపీ ప్రముఖుడు జేసీ దివాకర్రెడ్డి తన నియోజకరవర్గంలో అచ్చంగా యాభై కోట్లకు పైగా ఖర్చు అయిందని చెప్పి వాపోయారు.


అదే విధంగా ఏపీలో చాలా చోట్ల డబ్బు విచ్చల విడిగా పంపిణీ చేశారు. అందులో మొదటి స్థానం గుంటూరు జిల్లా మంగళగిరి అంటున్నారు. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పోటీ చేసిన ఈ సీటులో హోరా హోరీ పోరు సాగిందంట. దాంతో ఏసీలు, ఫ్రిజ్ లు ఇలా ఓటర్లకు తాయిలాలు అన్నీ ఇన్నీ కావుట. దాంతో ఇక్కడ మొత్తం ఎన్నికల ఖర్చు 200 కోట్లను దాటిందని ఓ అంచనా. అదే విధంగా మంత్రి నారాయణ పోటీ చేసిన నెల్లూరు అర్బన్ సీటులోనూ హెవీ ఫైట్ నమోదు అయిందంట. ఇక్కడ ఏకంగా మహిళా ఓటర్లకు ముక్కు పుడకలు, వెండి కుంకుమ భరిణలు ఇలాంటివి ఇచ్చారని టాక్. దాంతో ఇక్కడ భారీగా ఖర్చు జరిగిందని అంటున్నారు.


అదే విధంగా ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి పోటీలో ఉన్న గొట్టిపాటి రవికుమార్ సైతం ఏటికి ఎదురీదడంతో  డ‌బ్బు అక్కడ బాగా ఖర్చు అయిందని అంటున్నారు. రెండు పక్షాలు చావో రేవో అన్నట్లుగా మంచినీళ్ళలా నగదు ఖర్చు పెట్టారని అంచనాలు వేస్తున్నారు. ఇక గుడివాడ సీట్లోనూ వైసీపీ అభ్యర్ధి కొడాలి నానిని ఓడించడానికి టీడీపీ గట్టిగా పోరాడింది. దాంతో ఇక్కడ కూడా ఖర్చు ఆకాశాన్ని అంటిందట.


చివరిగా విశాఖ నార్త్ సీట్లో పోటీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రత్యర్ధులు ఇలా పోటా పోటీగా డబ్బు ఇక్కడ ఎన్నికల కోసం పారిందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఎన్నికలలో ఈసారి గెలుపే పరమావధిగా డబ్బుని ఎడా పెడా వాడేశారని తెలుస్తోంది. చూడాలి మరి ఫలితాలు ఎలా వస్తాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: