ఏపీలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ర్సెస్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్‌వీ సుబ్ర‌హ్మ‌ణ్యం అనే రీతిలో ప‌రిస్థితులు మారిపోయాయి. తెలుగుదేశం నేత‌లు సీఎస్‌పై నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లే ఇందుకు కార‌ణం. సుబ్ర‌హ్మ‌ణ్యంపై టీడీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లు రాజకీయ వ‌ర్గాల్లోనే కాదు, అధికారుల్లోనూ ఆస‌క్తిని రేకెత్తించాయి. తాజాగా, ఎల్వీ ఢిల్లీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ నేత‌లు వ‌ణికిపోతున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న ఢిల్లీ టూర్ ప‌రిణామాల‌ను ఊహించుకునే టీడీపీ క‌ల‌వ‌రం ప‌డుతున్నాయంటున్నారు.


పోలిండ్‌కు నాలుగు రోజుల ముందు ఎల్వీ సుబ్రహ్మణ్యం ను కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఎస్ గా నియమించింది. అప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న అనిల్ చంద్ర పునేఠాను తొలగించి ఈ నియామకం చేపట్టింది. అప్పటి నుంచీ ఎల్వీపై టీడీపీ నేత‌లు విమర్శలు చేస్తున్నారు. ఆయన వ్యవహార శైలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కాకుండా…విపక్ష వైకాపా అధికార ప్రతినిథిగా ఉందన్న విమర్శలు తెలుగుదేశం వర్గాలు చేస్తున్నాయి. తాజాగా ఎల్వీ అధికారిక ప‌ర్య‌ట‌న కోసం ఢిల్లీ వెళితే టీడీపీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. దీనికి కార‌ణంగా ఆయ‌న షెడ్యూలేన‌ని అంటున్నారు. 


శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారితో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ‘రాష్ట్రంలోని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా పరమైన చర్యలు- జిల్లా రిటర్నింగ్‌ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీ’లతో బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్‌లతో కలిసి సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్వహించిన సమీక్షా సమావేశానికి సంబంధించిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనున్నారు. అలాగే ఓట్ల లెక్కింపునకు నియమించే సిబ్బందికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారమే వారికి విధులు కేటాయిస్తామని సీఈఓ ద్వివేది స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ అమలులో ఉన్నందున సీఈసీ, ఏపీ సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమించిన అనంతరం తలెత్తిన వివాదాలు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదులు, ఈసీ జారీ చేసిన నోటీసుల నకళ్లు, పార్టీ నుండి వచ్చిన సమాధానాలను సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి అందజేయనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గత గురువారం సచివాలయంలో సీఆర్డీయే అధికారులతో రాజధాని నిర్మాణ పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేయడంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, సమీక్షలో పాల్గొన్నా సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, అమరావతి డెలవప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సీఎండీ లక్ష్మీపార్థసారథితో పాటు ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించనున్నారని సమాచారం.


ఇలా కీల‌క అంశంపై నివేదిక స్పందిస్తున్న నేప‌థ్యంలో ఎల్వీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా త‌మ బండారం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని భావించే....టీడీపీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నార‌ని స‌మ‌చారం. ఎల్వీ ఢిల్లీ టూర్‌లో క‌లిసే అధికారులు బాబు తీరుపై ఒక‌వేళ ప్ర‌క‌ట‌న చేస్తే...ఆయ‌న ప‌రువు గంగ‌లో క‌ల‌వ‌డం ఖాయ‌మ‌ని...అందుకే ఈ స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నార‌ని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: