వేలాది మంది జీవితాల‌ను ప్ర‌భావితం చేసి...ప‌దుల సంఖ్య‌లో విద్యార్థుల ప్రాణాలు పోయేందుకు కార‌ణ‌మైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతున్నాయి.  ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థి సంఘాల ఆందోళనలతో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడంతో... అవకతవకలపై లోతుగా దృష్టి సారించింది. ఇంటర్ ఫలితాలపై వరుసగా మూడో రోజూ త్రిసభ్య కమిటీ సమావేశమై 15 పేజీల నివేదికను తయారు చేసి సీల్డ్‌ కవర్‌లో ఈ నివేదిక‌ను అందించారు.


విశ్వ‌సనీయ‌వ‌ర్గాల స‌మాచారం ఇంటర్ ఫలితాల్లో అవకతవలపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ త‌న ద‌ర్యాప్తును ముగిసించి సంచ‌ల‌న నివేదిక ఇచ్చిన‌ట్లు స‌మాచారం. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసే నాటి నుంచే సాఫ్ట్‌వేర్‌ సమస్యలు తలెత్తినా ప్రైవేట్‌ సంస్థ, ఇంటర్‌బోర్డు చూపిన నిర్లక్ష్యమే చివరకు ఇంటర్‌ ఫలితాల్లో తప్పులతడకకు కారణమైందని త్రిసభ్య కమిటీ నిర్ధరణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇంటర్‌ ఫలితాల్లో దాదాపు 60 వేల సమస్యలు వచ్చాయని త్రిసభ్య కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. కాంట్రాక్టు తీసుకున్న గ్లోబరీనా సంస్థ ఏం చేస్తోంది? సాఫ్ట్‌వేర్‌ ఎలా ఉంది? అని ఇంటర్‌బోర్డు పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గ్లోబరీనా టెక్నాలజీస్‌ సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో తొలి నుంచి సమస్యలు ఉత్పన్నమవుతున్నా ఆ సంస్థ ప్రతినిధులు పట్టించుకోలేదని స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం.


కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను గ్లోబరీనా సంస్థ చేపట్టలేకపోవడంతో ఆ బాధ్యత సీజీజీకి అప్పగించారు. అయినా మళ్లీ గ్లోబరీనాను ఎందుకు కొనసాగించారో అధికారులు సమాధానం చెప్పలేకపోయారని తన నివేదికలో త్రిసభ్య కమిటీ నిలదీసినట్టు తెలుస్తోంది.  విద్యార్థుల ధ్రువపత్రాల్లో చాలా వరకు ప్రాక్టికల్‌ మార్కులు కనిపించలేదు. ఎంఈసీ గ్రూపులో పలువురికి సింగిల్‌ డిజిట్‌ మార్కులుచ్చాయి. అంటే 80 మార్కులకు బదులు 8 లేదా 0 అని వచ్చిందని పేర్కొంది. కాంట్రాక్టు దక్కించుకున్న ప్రైవేట్ సంస్థ సకాలంలో ఏ పనీ చేయలేదు. విద్యార్థులు చెల్లించిన రుసుములను కళాశాలల నుంచి తీసుకోవడం దగ్గర నుంచి హాల్‌టికెట్ల పంపిణీ వరకు సక్రమంగా చేయలేదని స్ప‌ష్టం చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నందున గ్లోబరీనా సాఫ్ట్‌వేర్‌పై పర్యవేక్షణ బాధ్యతలను సీజీజీకి అప్పగించాలని, అయినా సక్రమంగా చేయకుంటే ఆ సంస్థను తొలగించి మరో సంస్థకు ఇవ్వాలని స్ప‌ష్టం చేసింది. మరోవైపు వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై కూడా త్రిసభ్య కమిటీ కీలక సూచలు చేసినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: