ఏపీ ఎన్నికల్లో గెలుపుపై ధీమాగా ఉన్న వైసీపీ.. జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా ముహూర్తం రెడీ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు అనువైన తిథి, వార, నక్షత్రాల లెక్కలు వేస్తున్నారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ మోహన్ రెడ్డి మే 26న ప్రమాణస్వీకారం చేయనున్నారని చెప్పేశారు కూడా. 


ఒకవేళ వైసీపీ గెలిచిందంటే.. మే 26న ప్రమాణ స్వీకారానికి జగన్ సిద్ధపడ్డారన్నమాట. ఇటీవల జూన్ 8 వరకు చంద్రబాబు సీఎంగా ఉంటారంటూ టీడీపీ నేతలు వాదిస్తున్న విషయం తెలిసిందే. జగన్ మే 26న ప్రమాణం చేస్తే.. చంద్రబాబు జూన్ 8  వరకూ పదవిలో ఎలా ఉంటారని సజ్జల ప్రశ్నించారు. 

ఈ ప్రశ్నల సంగతి అలా ఉంచితే.. జగన్ ప్రమాణ స్వీకారానికి మే 26నే ఎందుకు ముహూర్తంగా ఎంచుకున్నారు..దీనికి ఓ వాదన వినిపిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 1972 డిసెంబర్ 21న పుట్టారు. ఆయనది ఆరుద్ర నక్షత్రం. 

2019 మే 26వ తేదీన ధనిష్ట నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రానికి ఇది పరమమైత్రి తార. ఆ రోజు ఆదివారం. సప్తమి. భాను సప్తమి. సూర్యుడు అన్ని తారలకు అధిపతి. ఇది చాలా దివ్యమైన ముహూర్తం అని పండితులు చెబుతున్నారట. 

ఇలాంటి ముహూర్తాలు ప్రమాణస్వీకారం, పట్టాభిషేకానికి మంచివని వారు వివరిస్తున్నారు. అందులోనూ జగన్ ఒక్కసారి సీఎం అయితే ముప్పై ఏళ్లు తానే ఏలాలని ముందుగానే ఫిక్సయి పోయారు. సో.. ఇలాంటి మంచి ముహూర్తంతోనే అది సాధ్యమని నమ్ముతున్నారేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: