రాజకీయ ఎత్తుగడల్లో చంద్రబాబు సిద్దహస్తుడు.. 40 ఏళ్ల అనుభవం మరి. ఆయన ఎన్నో ఎన్నికలు చూశాడు.. కొన్ని ఎన్నికల్లో విజయం.. మరికొన్ని ఎన్నికల్లో పరాజయం .. కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు వేసినన్ని ఎత్తులు మరే ఎన్నికల్లోనూ వేయలేదంటే అతిశయోక్తి కాదు. 


నాలుగేళ్లకుపైగా బీజేపీతో పొత్తు మెయింటైన్ చేసి ఎన్నికల ఏడాదిలో ఆ పార్టీతో తెగదెంపులు చేసుకోవడం మొదటి ఎత్తుగడ. ఆ తర్వాత పవన్, బీజేపీ, జగన్ అంతా తనపై దాడి చేస్తున్నారని విమర్శించారు. కానీ కాపు ఓట్లను దృష్టిలో ఉంచుకుని ఈ జాబితా నుంచి పవన్ ను తప్పించారు. 

ఆ తర్వాత పవన్ ప్లేసులోకి టీఆర్‌ఎస్‌ను తెచ్చారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌, వైసీపీ అంతా ఒకటే అని.. వాళ్లంతా ఏపీపై దాడికి వస్తున్నారని ప్రజలకు చెప్పడం మొదలుపెట్టారు. ఆంధ్రాని దెబ్బ తీయబోతున్నారనే ప్రచారం చేసుకున్నారు. ప్రచారంలోనూ చంద్రబాబు ఎన్నడూ చూడని భాష ఉపయోగించారు. 

జాతీయ స్థాయి ప్రత్యామ్నాయం తానే అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఎన్నికలకు ముందు.. ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేశారు. తన సిబ్బందిని బదిలీ చేస్తున్నారంటూ సానుభూతి కోసం ప్రయత్నించారు. సరిగ్గా ఎన్నికల ముందు ఓటర్ల చేతికి నగదు వచ్చేలా పసుపుకుంకుమ, ఫించన్ రెట్టింపు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వచ్చేలా ప్లాన్ చేశారు. 

పోలింగ్ సిబ్బందిలో ఆశావర్కర్లు, ప్రైవేటు సిబ్బందిని చొప్పించే ప్రయత్నం చేసి విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. పోలింగ్ రోజు.. ఈవీఎంలపై మొదట ఆరోపణలు గుప్పించారు. తర్వాత అంతా వచ్చి ఓటేయాలని పిలుపు ఇచ్చారు. జాతీయ స్థాయి పార్టీలనూ ఈసారి ప్రచారానికి పిలిచారు. మొత్తానికి చావో రేవో అన్నట్టు పోరాడిన బాబు మరి ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: