సార్వత్రిక ఎన్నికల్లో తుది ఫలితాల వెల్లడి ఆలస్యం కానుందా? అంటే అవుననే ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది అంటున్నారు. ఈవీఎంల కౌంటింగ్ ముందే పూర్తి అయిపోయినా తుది ఫలితాలు వెల్లడయ్యేందుకు సమయం పట్టనుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వీవీఫ్యాట్ల లెక్కింపు తర్వాతే తుది ఫలితాలు వెల్లడించాల్సి ఉండడంతో అదనంగా 6, 7 గంటల సమయం పట్టే అవకాశం ఉందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.

 

రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రజలు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న మే 23తేదీన ఎన్నికల ఫలితాల లెక్కింపు ఆలస్యం కానుంది. కొన్ని నియోజకవర్గాల్లో పూర్తి ఫలితాలు వెల్లడవ్వడానికి అర్థరాత్రి 12 గంటలు దాటే అవకాశాలున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తే మధ్యాహ్నం 2 గంటలకు చాలా చోట్ల కౌంటింగ్ పూర్తయ్యేది. సాయంత్రం 5 గంటలకే తుది ఫలితాలు వచ్చేవి. ఈసారి మాత్రం వీవీఫ్యాట్ల లెక్కింపుతో ఫలితాలను అధికారికంగా వెల్లడించడానికి ఆలస్యం కానుంది.


సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ర్యాండమ్‌గా ఐదు వీవీప్యాట్లను లెక్కించాలి. అలాగే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకూడా ఐదు పోలింగ్ కేంద్రాల్లోని వీవీప్యాట్లను లెక్కించాల్సి ఉంటుంది. వీవీప్ల్యాట్లలో స్లిప్పులను లెక్కించేందుకు రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులకు మాత్రమే అవకాశముంది. కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంల లెక్కింపు మధ్యాహ్నానికే పూర్తి అయినా వీవీప్యాట్ల స్లిప్పలు లెక్కించి వాటిని ఈవీఎంల ఓట్లతో సరిపోల్చిన తర్వాతే తుది ఫలితాలను ప్రకటిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: