విశాఖ జిల్లా ఏజెన్సీలో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన గిడ్డి ఈశ్వరి తాజా ఎన్నికల్లో గెలుస్తుందా అంటే సమాధానం పెద్దగా రావడంలేదు. ఓ మామూలు టీచర్ గా ఉన్న గిడ్డి ఈశ్వరిని 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి జగన్ ప్రోత్సహించారు. వైసీపీ గాలితో మంచి మెజారిటీతో ఈశ్వరి విజయం సాధించారు. అప్పట్లో మంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత పసుపులేటి బాలరాజుని సులువుగా  ఈశ్వరి పక్కకు నెట్టేశారు. మూడున్నరేళ్ల పాటు వైసీపీకి అండగా ఉంటూ ఏజెన్సీలో  పార్టీని గాడిలో పెట్టిన ఈశ్వరి వైసీపీతోనే తన జీవితం అన్నంతగా నిబద్ధత చాటారు. అయితే అనూహ్యంగా ఆమె కూడా ఫ్లేట్ ఫిరాయించి సైకిలెక్కేశారు.


ఫిరాయించిన గిడ్డి ఈశ్వరి పట్ల ఏజెన్సీలో వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఎన్నికలకు ముందే తెలిసిపోయింది. అయితే అధికార తెలుగుదేశం పార్టీ ఆమెకే టికెట్ ఇచ్చింది. ఇక పార్టీలో మాజీ మంత్రి మణికుమరి. ఇతర నాయకులు సైతం ఆమె విజయానికి పెద్దగా సహకరించలేదని టాక్. అదే విధంగా గిడ్డి కూడా  వైసీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధ్యాన్యత ఇస్తూ అసలైన టీడీపీ వారిని పక్కన పెట్టేశారని అంటారు. దీంతో ఆమెకు సైకిల్ పార్టీ నుంచి పెద్దగా సాయం అందలేదు. దానికి తోడు గిరిజనులు సైతం వైసీపీకి జై కొట్టడంతో ఇక్కడ గిడ్డి ఎదురీదారని పోలింగ్ సరళి తెలియచేస్తోంది. 


ఇక ఇక్కడ మరో వైపు జనసేన నుంచి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పోటీకి దిగారు. ఆయన తనకంటూ సొంత క్యాడర్ ఏర్పాటు చేసుకున్నారు. దానితో పాటు, జనసేన అభిమానులు కూడా తోడు అయ్యారు. ఆ విధంగా చాలా ఓట్లు ఆయన చీల్చేశారు. అది గిడ్డికి  పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. వైసీపీ నుంచి  మాజీ ఎమ్మెల్యే కొట్టగిళ్ల చిట్టినాయుడు కుమార్తె భాగలక్ష్మి పోటీ చేయడంతో సహజంగానే ఆమెవైపు గిరిజనం మొగ్గు చూపారు.
ఇక మరో వైపు అరకు ఎమ్మెల్యెగా మరో మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తె మాధవి పోటీ చేయడంతో అన్నీ కలసివచ్చి భాగ్యలక్ష్మి గెలుపు ఇక్కడ ఖాయమైందని పోలింగు జరిగిన తీరు స్పష్టం చేస్తోంది. మొత్తం మీద చూసుకుంటే గిడ్డి ఈశ్వరికి టికెట్ రాదని మొదట్లో ప్రచారం జరిగినా ఆమె అక్కడ సక్సెస్ అయింది  కానీ జనం మెప్పు పొందడంలో మాత్రం విఫలం అవుతోందని అంటున్నారు. ఈశ్వరి పరాజయం పాలు అయితే మాత్రం బంగారం  లాంటి అవకాశం పాడుచేసుని వన్ టైం ఎమ్మెల్యేగా పాడేరు చరిత్రలో  ఆమె మిగిలిపోనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: