వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  ఇటీవల చేసిన వ్యాఖ్యల వెనక ఉన్న అంతరార్థం ఏంట‌న్న ? దానిపై ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు.  జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు మనవ‌డు అయినా  ఆ కుటుంబంలో ఆయనకు ఎప్పుడూ సరైన గుర్తింపు లేదన్నది వాస్తవం. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్‌కు మాత్రమే కాదు హరికృష్ణ కుటుంబానికి నందమూరి,  నారా ఫ్యామిలీలో సరైన ప్రాధాన్యత లేదు. గత ఎన్నికలకు ముందు హరికృష్ణ సమైక్యాంధ్ర కోసం తన రాజ్యసభ పదవిని తృణప్రాయంగా వదిలేశారు. ఆ ఎన్నికల్లో హరికృష్ణ అసెంబ్లీకి పోటీ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు లేదా నూజివీడు అసెంబ్లీ సీట్లలో ఏదో ఒక సీటును తనకు ఇవ్వాలని బాబు వద్ద ఒత్తిడి తెచ్చారు. 


చంద్రబాబు మాత్రం హ‌రికృష్ణ విజ్ఞప్తిని పక్కనపెట్టి హరికృష్ణ సోదరుడు, తన వియ్యంకుడైన బాలకృష్ణకి మాత్రం టీడీపీ కంచుకోట అయిన హిందూపురం సీటు ఇచ్చారు. గత ఎన్నికల నుంచి హరికృష్ణను పూర్తిగా దూరం పెట్టేసిన చంద్రబాబు, బాలకృష్ణ హరికృష్ణ మృతి చెందినప్పుడు మాత్రం కేవలం సమాజం కోసమే ఆ కుటుంబానికి దగ్గర అయినట్టు కనిపించింది. తెలంగాణ ఎన్నికల్లో సానుభూతి కోసం హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూకట్‌ప‌ల్లిలో బలవంతంగా పోటీ చేయించి ఆమె ఓటమికి కారణమయ్యారు. ఆ ఎన్నికల్లో సోదరి తరపున ప్రచారం చేసేందుకు ఎన్టీఆర్,  కళ్యాణ్‌రామ్ వస్తారని అనుకున్నా... వారిద్దరు ప్రచారానికి దూరంగా ఉన్నారు. చంద్ర‌బాబు త‌మ‌ను ఈ ఎన్నిక‌ల‌కు వాడుకుని మ‌ళ్లీ దూరం పెడ‌తార‌నే వారు ప్ర‌చారానికి రాలేద‌న్న చ‌ర్చ‌లు కూడా న‌డిచాయి. ఆ తర్వాత చంద్రబాబు మళ్లీ హరికృష్ణ ఫ్యామిలీని పూర్తిగా దూరం పెట్టేశారు. 


ఇక ఈ ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు వైసిపిలో జాయిన్ అయ్యారు. నార్నే కూడా గతంలో చంద్రబాబు బాధితుడే. ఆయనకు గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే సీటు ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్న విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తాజాగా ఓ విలేఖరి ఇదే విషయాన్ని ఎన్టీఆర్ వద్ద ప్రస్తావించగా తన మామ వైసీపీలో  జాయిన్ అవటం అనేది... ఆయన వ్యక్తిగత విషయమని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని చెప్పేంత రాజకీయ పరిజ్ఞానం తనకు లేదన్న ఎన్టీఆర్ వైసీపీ అధినేత వైఎస్ జగ‌న్‌పై కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి మృతి చెందినప్పుడు జగన్ తనతో మరణం అనేది ప్రతి ఒక్కరికి సహజమని.... అయితే  ఎవరైతే ప్రజల మనసుల్లో ఉండిపోతారు..... వారికి ఉండే ప్రత్యేకతే వేరు చెప్పినట్టు ఎన్టీఆర్ తెలిపారు. అలాంటి ప్రత్యేకమైన వ్యక్తులలో మీ తండ్రి హరికృష్ణ కూడా ఒకరు.. ఆయన జీవితాంతం పేద ప్రజల కోసమే పోరాటాలు చేశారని జగన్ ప్రశంసించినట్లు ఎన్టీఆర్ ఆ విలేకరితో ప్రస్తావించారు. 


ఇక తాను కూడా హరికృష్ణ బాటలోనే పేద ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారట. మరణం గురించి తనకు భయం లేదని అయితే తన భయం వల్ల పేదలకు సేవ చేయాలన్న తన లక్ష్యాన్ని చేరుకోకుండా మరణిస్తేనే తన జీవితానికి అర్థం ఉండదని జగన్ చెప్పినట్టు ఎన్టీఆర్ తెలిపారు. తాను పిరికి వాడిని అయితే సోనియా, రాహుల్ గాంధీకి ఎదురు వెళ్లే వాడిని కానని.. త‌న‌పై క‌త్తి దాడి జ‌రిగాక ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలంటే ఎంతో భయపడేవాడినని జ‌గ‌న్ అన్న‌ట్టు ఎన్టీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇక ఎన్టీఆర్ భ‌యం గురించి మాట్లాడుతూ జీవితంలో త‌న‌కు రెండో సారి భ‌యం క‌లిగింద‌ని, త‌న తండ్రి చ‌నిపోయిన‌ప్పుడు తొలి సారి తాను భ‌య‌ప‌డితే త‌ర్వాత జ‌గ‌న్ గారి మాట‌ల‌తో  మ‌రో సారి భ‌య‌ప‌డ్డాన‌ని, ఆ మాట‌లు విన్నాక అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌పై ఉన్న అభిమానం కాస్త గౌర‌వంగా మారింద‌ని కూడా జూనియ‌ర్ చెప్పారు. 


జ‌గ‌న్ లాంటి గొప్ప శ్రేయోభిలాషి వంటి వ్య‌క్తి నా మిత్రుడు కావ‌డం నా అదృష్టం అని కూడా ఎన్టీఆర్ ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. ఇక జ‌గ‌న్ వ్య‌క్తిత్వం గురించి జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ఇంత గొప్ప‌గా చెప్ప‌డంతో జ‌గ‌న్ అభిమానులు కూడా ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తుతూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఎన్టీఆర్ గ‌త ఐదారు నెల‌లుగా ఏపీ రాజ‌కీయాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తు వ‌స్తున్నారు. ఏపీ రాజ‌కీయాల్లో గెలుపు ఎవ‌రిద‌న్న విష‌యం ఓపెన్‌గా చెప్ప‌క‌పోయినా ప‌రోక్షంగా ఈ మాట‌ల‌ను బ‌ట్టి జ‌గ‌న్‌కు స‌పోర్ట్ చేసిన‌ట్టు కూడా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే టీడీపీకి చావోరేవోగా మారిన ఈ ఎన్నిక‌ల‌కు ఎన్టీఆర్ దూరంగా ఉండ‌డం కూడా అదే కార‌ణ‌మంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: