ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు, ఆరోపణలు గుప్పించటంలో మంత్రివర్గంలోని చాలామంది బాగా అత్యుత్యాహం చూపించేవారు. సమయం, సందర్భం లేకపోయినా సరే బోడిగుండుకు మోకాలికి ముడేసి మరీ జగన్ పై ఒంటికాలిపై లేచేవారు. అలాంటి మంత్రుల్లో ఇపుడు చాలామంది అస్సలేమాత్రం నోరిప్పటం లేదు. ఒకవైపు చంద్రబాబునాయుడు వైసిపి అధ్యక్షుడిపై ఇంతలా మండిపడుతున్నా వీళ్ళు మాత్రం తమకేమీ పట్టనట్లే ఉంటున్నారు.

 

ఉత్తరాంధ్రకు చెందిన టిడిపి మంత్రుల్లో అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కిమిడి కళా వెంకటరావు జగన్ పై చెలరేగిపోయేవారు. మొక్కుబడిగానో లేకపోతే తప్పదన్నపుడో సుజయ కృష్ణా రంగారావు, గంటా శ్రీనివాసరావు జగన్ పై మండిపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి అలాంటిది ఎన్నికలైపోయిన తర్వాత చింతకాయల, అచ్చెన్న గొంతు ఎక్కడా వినబడటం లేదు.  తమ గెలుపే కష్టమైందా లేకపోతే వైసిపి అధికారంలోకి వస్తే తమకు ఇబ్బందులు తప్పవని అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు.

 

అలాగే ఉభయగోదావరి జిల్లా మంత్రుల్లో హోంశాఖ మంత్రి నిమ్మకాలయ చినరాజప్ప కూడా మాటకొస్తే జగన్ పై బాగానే ఎగిరిపడేవారు. అలాంటిది పోలింగ్ తర్వాత పెద్దగా మాట్లాడటం లేదు. యనమల మాట్లాడుతున్నారు కానీ ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. పితాని మొదటి నుండి కూడా జగన్ పై పెద్దగా ఆరోపణలు చేసింది లేదు లేండి. కెఎస్ జవహర్ పోలింగ్ తర్వాత జగన్ కు వ్యతిరేకంగా తన జోరును తగ్గించేశారు.

 

అదేవిధంగా రాజధాని జిల్లాలను తీసుకుంటే నారా లోకేష్, దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు మాత్రం ఇంకా నోటికొచ్చినట్లు మాట్లాడుతునే ఉన్నారు.  పత్తిపాటి పుల్లారావు జోరు తగ్గిపోయింది. కోడెల వ్యవహారం సరేసరి. పోలింగ్ రోజున జరిగిన ప్రజా సత్కారం వల్ల మళ్ళీ ఎక్కడా మాట్లాడటం లేదు. కొల్లు రవీంద్ర గొంతు కూడా పెద్దగా  వినబడటం లేదు.  నెల్లూరులో సోమిరెడ్డి మాత్రం యథాప్రకారం మాట్లాడుతున్నా నారాయణ గొంతు వినబడటం లేదు. ప్రకాశంలో శిద్ధా ఆరోపణలు చేసింది తక్కువే జగన్ పై.

 

రాయలసీమ విషయం చూస్తే అనంతపురంలో సునీత, కాలువ గొంతులు కూడా తగ్గిపోయాయి. పోలింగ్ కు ముందు జగన్ ను నోటికొచ్చినట్లు కాలువ ఎలాపడితే అలా మాట్లాడిన విషయం అందరికీ తిలిసిందే. కర్నూలు కెఇ, భూమా గొంతులు వినబడటమే లేదు. కడపలో ఆది నారాయణరెడ్డి కూడా జోరు తగ్గించేశారు. చిత్తూరులో  అమరనాధరెడ్డి గొంతు కూడా లేవటం లేదు.  

 

మంత్రులెందుకు జగన్ పై తమ గొంతును తగ్గించేశారంటే కౌంటింగ్ భయంతోనే అని ప్రచారం జరుగుతోంది. వైసిపి అధికారంలోకి వస్తే తమ పరిస్ధితి ఏమిటనే విషయంలో చాలామంది మంత్రుల్లో టెన్షన్ మొదలైందట. పోటీ చేసిన మంత్రుల్లో ఎంతమంది గెలుస్తారో కూడా తెలీదు. టిడిపిలో జరుగుతున్న ప్రచారం ప్రకారమైతే చాలామంది మంత్రులు ఓటమిబాటలో ఉన్నారట. అందుకనే వైసిపి అధికారంలోకి వస్తే జగన్ ను ఏదోరకంగా మ్యానేజ్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట. అందుకనే జగన్ పై ఆరోపణలు చేయటంలో నోళ్ళు కట్టేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: