క‌ర్నాట‌క రాజ‌కీయాల్లో మ‌రో హీరోయిన్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం దాదాపు స‌క్సెస్ అయిన‌ట్టే. సీనియ‌ర్ హీరోయిన్ సుమ‌ల‌త మండ్య నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. క‌న్న‌డ రెబ‌ల్‌స్టార్‌గా పేరున్న అంబ‌రీష్ స‌తీమ‌ణి అయిన సుమ‌ల‌త మండ్య పోరులో ముందు నుంచి ఫేవ‌రెట్‌గానే బ‌రిలో ఉన్నారు. అక్క‌డ సుమ‌ల‌త గెలుపు కోసం అనేక స‌మీక‌ర‌ణ‌లు అనుకూలంగా ఉన్నాయి. ఇక అంబ‌రీష్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు క‌న్న‌డ నాట సిద్ధ‌రామ‌య్య కేబినెట్‌లో మంత్రిగా ప‌నిచేశారు. ఆయ‌న‌కు మండ్య జిల్లాలో మంచి ప‌ట్టు ఉంది. 


అక్క‌డ అంబరీష్ 'మండ్యదగండు', లోకల్ వ్యక్తిగా పేరు పొందాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉంటోన్న ఆయ‌న గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. ఇక ఈ ఎన్నిక‌ల్లో సుమ‌ల‌త మండ్య నుంచి ఎంపీ సీటు ఆశించారు. అయితే జేడీఎస్ + కాంగ్రెస్ పొత్తులో భాగంగా జేడీఎస్ ఈ సీటును కోర‌డంతో సుమ‌ల‌త‌కు సీటు ఇవ్వ‌లేక కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది. కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్ గౌడ (జాగ్వార్ హీరో) ఇక్క‌డ బ‌రిలో ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నిఖిల్ సామాజిక‌వ‌ర్గం అయిన వ‌క్క‌లిగ‌లు 60 శాతం వ‌ర‌కు ఉన్నారు.


అందుకే జేడీఎస్ ఈ సీటును వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. చివ‌ర‌కు సుమ‌ల‌త ధైర్యం చేసి ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగారు. ఇక్క‌డ ఆమెకు సానుభూతి బాగా క‌లిసి వ‌చ్చింది. దీనికి తోడు బీజేపీ ఆమెకు మ‌ద్ద‌తు ఇచ్చింది.  స్థానిక కాంగ్రెస్ వాళ్లు జేడీఎస్ తో వైరాన్ని మనసులో పెట్టుకుని సుమలతకు సహకరించారనే వార్తలు వస్తున్నాయి. ఇక క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో యంగ్ స్టార్ హీరోలు ద‌ర్శ‌న్‌, యాష్ ఆమెకు ఓపెన్‌గానే ప్ర‌చారం చేశారు.


ఇక సుమ‌ల‌త మ‌న తెలుగ‌మ్మాయే. సుమ‌ల‌త స్వ‌స్థ‌లం గుంటూరు జిల్లా రేప‌ల్లె. ఆమె నాయుడు (కాపు) సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు. క‌న్న‌డ‌నాట జేడీఎస్ నాయ‌కులు ఆమె కులాన్ని గురించి కూడా ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. ఇక ర‌జ‌నీకాంత్‌, మోహ‌న్‌బాబు, చిరంజీవి కూడా సుమ‌ల‌త‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు. ఇక్క‌డ తెలుగు ఓట‌ర్లు కూడా ఆమె వైపే నిలిచారు. ఇవ‌న్నీ జేడీఎస్‌కు మైన‌స్‌గా మారాయి. వీటితో పాటు పైన చెప్పుకున్న ప‌రిణామాలు సుమ‌ల‌త గెలుపును కౌంటింగ్ కాకుండానే ఖ‌రారు చేశాయి. 


ఇక పోలింగ్ ముగిశాక త‌న‌యుడి గెలుపుపై ఇంటిలిజెన్స్ రిపోర్టు తెప్పించుకున్న కుమార‌స్వామి షాక్‌కు గురైన‌ట్టు తెలిసింది. ఇంటిలిజెన్స్ రిపోర్టుల‌తో పాటు తాను పార్టీ నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మీక్ష‌లో సైతం నిఖిల్‌కు గెలుపు ఛాన్స్‌లు త‌క్కువుగా ఉన్నాయని.. సుమ‌ల‌త‌కే మెజార్టీ ఛాన్సులు ఉన్న‌ట్టు తేలింద‌ట‌. ఏదేమైనా మ‌న తెలుగుమ్మాయి అయిన ఈ సీనియ‌ర్ హీరోయిన్ మొత్తానికి లోక్‌స‌భ‌లో అడుగు పెట్టే ఛాన్సులే ఎక్కువుగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: