సోష‌ల్ మీడియాలో చురుకుగా స్పందించే టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ మ‌రోమారు ఆన్‌లైన్ వేదిక‌గా నెటిజ‌న్ల‌తో అనుసంధానం అయ్యారు. ఆదివారం సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో  కేటీఆర్ నెటిజన్లతో ఇంటరాక్ట్ అయ్యారు. ‘ఆస్క్‌ కేటీఆర్‌’ హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో ట్విట్టర్ వేదికగా వారితో సంభాషించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. దేశ, రాష్ట్ర రాజకీయాలు, రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు.. ఇలా అనేక అంశాలపై కేటీఆర్‌ సూటిగా, చతురతతో సమాధానాలిచ్చారు.


తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా  మారిన ఇంటర్ ఫలితాల విషయంలో నెలకొన్న గందరగోళంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు దొర్లటం దురదుష్టకరమన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర ఆవేదన కలిగించాయని చెప్పారు. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై త్వరలోనే చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయం ప్రభుత్వానిదేనన్న కేటీఆర్..  గ్లోబరీనా సంస్థకు తన మద్దతు ఉందనేది అసత్య ప్రచారమన్నారు. ఇంటర్‌ పరీక్షల వివాదం తలెత్తేవరకు గ్లోబరీనా ప్రతినిధులెవరో కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు.
వచ్చే ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం, విద్య, వైద్య, మౌలిక రంగాలపై ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధి చేయడం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని కేటీఆర్ చెప్పారు. మే 23న వెల్లడించే ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని..ఇది నిరంతరం సాగే ప్రక్రియ అని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నందునే ప్రభుత్వ దవాఖానాల్లో 40శాతం మేర ప్రసవాలు పెరిగాయన్నారు.


కాలుష్య నియంత్రణ కోసం హైదరాబాద్‌ నగరంలో ఎలక్ట్రిక్‌ బస్సులు, వాహనాలను ప్రవేశపెడుతామని కేటీఆర్ అన్నారు. ఎంఎంటీఎస్‌ రెండోదశకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని కేటీఆర్ ఫైరయ్యారు. బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని నెటిజన్లకు సూచించారు.   హైదరాబాద్‌ నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.దుర్గం చెరువు ప్లెఓవర్‌ నిర్మాణ పనులు మరికొన్ని నెలల్లో పూర్తవుతాయని కేటీఆర్ చెప్పారు.


నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు కేటీఆర్ చతురతతో కూడిన సమాధానం ఇచ్చారు. ఇప్పటివరకు 100 ట్వీట్లు చేసినా.. ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వ‌లేదని.. మీరు రిప్లై ఇవ్వకపోతే నారా లోకేశ్‌ మీదొట్టు.. అని ఒక నెటిజ‌న్ కేటీఆర్‌ను అడిగారు. మధ్యలో ఆయన ఏం చేశాడు బ్రదర్‌ అంటూ నవ్వుతూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ‘నేను ఎన్ని ట్వీట్లు చేసినా రిప్లై ఇవ్వట్లేరు .. అసలు మీరు రిప్లై ఇవ్వాలంటే ఏం చేయాలి’ అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు.. ‘మంచి ప్రశ్న అడగాలి’ అంటూ.. చతురతతో సమాధానమిచ్చారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ ఒక్క పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది అక్కడి ప్రజలు నిర్ణయిస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.
  



మరింత సమాచారం తెలుసుకోండి: