ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా  మిగిలిన జిల్లాల కంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో  చాలా నియోజకవర్గాల్లో పోరు రసవత్తరంగా ఉంటుంది. ఇక్కడ ప్రధాన పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు అంగ‌, ఆర్ధిక, సామాజిక బ‌లాబ‌లాల్లో స‌రి స‌మానులుగా ఉంటారు. ఇక గుంటూరు జిల్లాలో గత కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి నాయకులే ఇక్కడ రాజకీయాలను శాసిస్తున్నార‌ని  ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతోమంది మహామహులను అసెంబ్లీ, పార్లమెంట్‌కు పంపిన ఘనత గుంటూరు జిల్లా దక్కించుకుంది.  గుంటూరు జిల్లాలో ఎన్ని సీట్లు ఉన్నా పల్నాడులో ప్రకాశం జిల్లాకు సరిహద్దున... నల్లమలలో ఉన్న వినుకొండ నియోజకవర్గం శైలే వేరు. టిడిపి జిల్లా అధ్యక్షుడు జీవీ. ఆంజనేయులు ఈ నియోజకవర్గం నుంచే గత రెండు ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలుస్తూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లో మరోసారి ఆయన బరిలో ఉండటంతో పాటు... మూడో గెలుపుతో హ్యాట్రిక్ కొడతాన‌న్న ధీమాతో ఉన్నారు. వినుకొండలో ఎన్నికలు జరిగిన తీరు పరిశీలిస్తే ఈ సారి ఆంజనేయలు గెలుపు అంత సులువు కాదు. 


గత రెండు ఎన్నికల్లోనూ బలహీనమైన ప్రత్యర్థులను ఎదుర్కొని భారీ మెజార్టీతో విజయాలు సాధిస్తూ వస్తున్న ఆయనకు ఈసారి బొల్లా బ్రహ్మనాయుడు రూపంలో  గట్టి పోటీ ఎదురైంది. ఇదే బొల్లా 2009లో ఆంజనేయులుపై పోటీ చేసినా ఆ ఎన్నికల్లో ఆయన ప్రధాన ప్రత్యర్థి కాదు.  ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. గత ఎన్నికలకు ముందు నాలుగేళ్ల పాటు వినుకొండలో గ్రౌండ్ వర్క్ చేస్తున్న బొల్లాను జగన్ చివరి నిమిషంలో పెదకూరపాడు పంపారు. గత ఎన్నికల్లో  ఓటమి తర్వాత తిరిగి వినుకొండ ఇన్‌చార్జిగా వచ్చారు. ఐదేళ్లపాటు నియోజకవర్గంలో వైసీపీని  బలోపేతం చేశారు.  వరుసగా రెండు సార్లు ఓడిపోయారు అన్న సానుభూతి, ఎమ్మెల్యే జీవీపై కొన్ని వర్గాలలో ఉన్న వ్యతిరేకత,  సొంత సామాజికవర్గంలో ఈ సారి చాలా మంది బొల్లా వైపు మొగ్గు చూప‌డం... ఏపీలో ఉన్న వైసీపీ వేవ్ ఈ సారి బొల్లాకు కలిసొచ్చాయి.  గుంటూరు జిల్లాలోనే అన్ని అసెంబ్లీ, ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న వారిలో ఇద్దరు  ధనవంతులు పోటీపడిన నియోజకవర్గం వినుకొండ కావడంతో... ఈ ఎన్నికల్లో  వినుకొండలో గెలుపు కోసం ఇద్దరు కోట్లాది రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేశారు. 


ఇక పోలింగ్ ముగిశాక జీవి, అటు బ్రహ్మనాయుడు ఇద్దరు గెలుపుపై ధీమాతో ఉన్నారు. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో జీవి వర్గంలో  కొంత ఆందోళన ఉన్నమాట అయితే వాస్తవం. గతంలోలా  20 వేల మెజార్టీలు రావని రెండు వేల మెజార్టీతో అయినా తమ నేతే గెలుస్తాడని  టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ వినుకొండలో జీవీని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచి తన చిరకాల కోరికను నెరవేర్చుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసిన బొల్లా ఆంజనేయులుకు ధీటుగా ఎత్తుకు పైఎత్తులు వేశారు. దీనికి తోడు ఈ సారి వినుకొండలో వైసిపి గెలవాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కసితో పని చేశారు. ఇక నియోజకవర్గంలో  జనసేన విషయానికి వస్తే ఆ పార్టీకి గెలిచే అంత సీన్ లేకపోయినా ఆ పార్టీ చీల్చే ఓట్లు జీవి, బొల్లాల‌లో ఎవ‌రిని ? గెలిపిస్తాయి.. ఎవ‌రిని ? ఓడిస్తాయి అన్న‌ది ఎవ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోలా ఈ సారి ఇక్క‌డ వేల‌కు వేలు మెజారిటీ వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఇటు జీవీ గెలిచినా, అటు బొల్లా గెలిచిన మెజారిటీ రెండు నుంచి నాలుగు వేల లోపు మాత్ర‌మే ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. 


బొల్లాప‌ల్లి మండ‌లంలోని ప్ర‌తీ బూత్‌లోనూ వైసీపీకి ఎంతో కొంత మెజారిటీ వ‌స్తుంద‌ని ఆ పార్టీ శ్రేణులు లెక్క‌లు వేసుకుంటున్నాయి. ఈ ఒక్క మండ‌లం నుంచే త‌మ‌కు ఆరు వేల నుంచి ఎనిమిది వేల మెజారిటీ రావ‌డం ఖాయమ‌ని వైసీపీ వాళ్లు చెబుతున్నారు. అదే టైమ్‌లో టీడీపీ నాయ‌కులు మాత్రం ఆ మండ‌లం నుంచి త‌మ‌కు మూడు వేల మెజారిటీ ఉంటుంద‌ని చెబుతున్నారు. వాస్త‌వంగా చూస్తే బొల్లాప‌ల్లి మండ‌లంలో టీడీపీ ముందు నుంచి వీక్‌. శావ‌ల్యాపురం మండ‌లం టీడీపీకి కంచుకోట‌కాగా... ఆ మండ‌లం బ్ర‌హ్మ‌నాయుడు సొంత మండ‌లం కావ‌డంతో ఈ సారి నువ్వా ? నేనా అన్న‌ట్టుగా అక్క‌డ పోరు న‌డిచింది. ఇక టీడీపీకి ప‌ట్టున్న నూజండ్ల‌, ఈపూరు మండ‌లాల్లో ఆ పార్టీకి గ‌తంలో వ‌చ్చిన మెజారిటీతో పోలిస్తే చాలా తక్కువ మెజారిటీనే రానుంది. ఇక వినుకొండ ప‌ట్ట‌ణంలో మెజారిటీపై రెండు పార్టీలు ఆశ‌లు పెట్టుకున్నాయి. ఓట్ల కొనుగోలుతో పాటు పోల్ మేనేజ్‌మెంట్ చెయ్య‌డంలో ఇద్ద‌రు నేత‌లు ఎవ‌రికి వారే త‌మ‌కు తామే సాటి అనిపించుకున్నారు. ఏదేమైన ఫైన‌ల్‌గా వినుకొండ సంగ్రామంలో గుంటూరు జిల్లాలోనే అత్య‌ధిక ధ‌నికులుగా పోటీ ప‌డిన ఈ ఇద్ద‌రు నేత‌ల్లో ఎవ‌రు ? విజ‌యం సాధిస్తారో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: