ఇంట‌ర్ బోర్డ్ ఫ‌లితాల్లో అవ‌క‌త‌వ‌క‌లు, వాటిపై వివిధ వ‌ర్గాలు చేస్తున్న ఆందోళ‌న‌లు ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, టీవీ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి నాయకులు  బోర్డు కార్యాలయం దగ్గరకు చేరుకొని...కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బోర్డు కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నినాదాలు చేస్తూ ముట్టడికి దిగిన నిరసనకారులు, విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌ను వెంటనే తొలగించాలని విద్యార్థి సంఘాల నేత‌లు డిమాండ్ చేశారు.


మ‌రోవైపు ఇంటర్‌ బోర్డు దగ్గర అఖిలపక్షం నేతలు మహాధర్నా పేరుతో ఆందోళన తలపెట్టారు. ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం నెలకొన్న క్రమంలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, వామపక్షాలు కలిసి ఇంటర్‌ బోర్డును ముట్టడించాలని నిర్ణయించాయి. అయితే, ఆయా పార్టీల నేతలను ముందుస్తుగా హౌజ్ అరెస్టులు చేశారు. టీజేఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు కోదండరామ్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ నేత అంజన్‌కుమార్‌ యాదవ్‌లను పోలీసులు గృహనిర్బంధం చేశారు. 


ఇదిలాఉండ‌గా, ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవలు, విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌  నిరవధిక నిరశన దీక్షకు దిగారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన దీక్ష ప్రారంభించారు. రాజకీయాలకన్నా తెలంగాణ విద్యార్థుల జీవితాలే తనకు ముఖ్యమని ఆయన అన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించేవరకూ దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: