అందరిలోను ఇపుడిదే చర్చ జరుగుతోంది. రాజకీయపార్టీల్లో మొదలైన చర్చ జనసామన్యంలోకి కూడా పాకింది. మధ్యతరగతి జనాలు కూడా ఇదే విషయమై వాకాబు చేస్తున్నారు. మే 23వ తేదీ అంటే కౌంటింగ్ తేదీ అన్న విషయం అందరికీ తెలిసిందే. కౌంటింగ్ రోజున తెలుగుదేశంపార్టికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తే అల్లర్లు జరుగుతాయనే ప్రచారం మాత్రం బాగా జరుగుతోంది.

 

అందుకు హేతువు ఏమిటంటే పోలింగ్ రోజున జరిగిన గొడవలే. ఏప్రిల్ 11వ తేదీన జరిగిన పోలింగ్ లో చిత్తూరు, అనంతపురం, కడప, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం వైసిపి అభ్యర్ధి డాక్టర్ ఎంఎస్ బాబుపై దాడి చేసి చెత్త చెత్తగా కొట్టారు. అలాగే తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఓ వైసిపి కార్యకర్తను కొట్టి చంపేశారు.

 

అలాగే అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో కూడా ఓ వైసిపి కార్యకర్తను కొట్టి చంపేశారు. పోలింగ్ రోజున మొత్తం  ముగ్గురు వైసిపి కార్యకర్తలు మరణించారు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ గొడవ గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా తక్కువే. నరసరావుపేట వైసిపి అభ్యర్ధి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల వైసిపి అభ్యర్ధి కాసు మహేష్ రెడ్డిపైన కూడా దాడి చేసి గాయపరిచారు.

 

పోలింగ్ రోజున దాదాపు ఏడుమంది వైసిపి అభ్యర్ధులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడింది వైసిపి అభ్యర్ధులు, చనిపోయింది వైసిపి కార్యకర్తలు అంటే గాయపరిచింది, దాడులు చేసి కొట్టింది ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడులు కాకుండా గుంతకల్ నియోజకవర్గం లాంటి చోట్ల పోలింగ్ కేంద్రాల్లోని వివి ప్యాట్లు, ఈవిఎం మెషీన్లను ధ్వంసం చేసిన ఘటనలు కూడా జరిగాయి.

 

పోలింగ్ రోజున జరిగిన అల్లర్లు కౌంటింగ్  రోజు జరగబోయే గొడవలకు సంకేతాలుగా వైసిపి నేతలు కూడా అనుమానిస్తున్నారు. ముఖ్యంగా పై నియోజకవర్గాలతో పాటు కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలతో పాటు కృష్ణా, ఉత్తరాంధ్రలో కూడా పలు నియోజకవర్గాల్లో గొడవలు జరిగేందుకు అవకాశాలున్నట్లు అనుమానిస్తున్నారు.  అందుకే చీఫ్ సెక్రటరీ పదే పదే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్తగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు లేండి. మొత్తానికి 23వ తేదీన ఏం జరుగుతుందో అన్న ఆందోళనైతే మొదలైపోయింది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: