ఆయన అనేక యుధ్ధాల్లో ఆరితేరిన రాజకీయ యోధుడు. నాలుగున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన నాయకుడు. పలుమార్లు లోక్ సభకు, ఓ మారు రాజ్యసభకు ఎన్నికైన నేత. కాంగ్రెస్ పార్టీతో మూడు తరాల అనుబంధం పెనవేసుకున్న కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఉద్దండుడుగా పేరు గాంచారు. పలు కీలకమైన మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహించారు. అటువంటి కిశోర్ మరోమారు పార్లమెంట్ మెట్లు ఎక్కాలన్న ఆరాటంతో ఆఖరి దశలో తెలుగుదేశం పార్టీ తీర్ధాన్ని స్వీకరించారు. అరకు నుంచి ఎంపీగా ఆయన పోటీకి దిగారు. డెబ్బయి ఏళ్ళకు పైబడిన వైరిచర్లకు ఓ విధంగా ఇది చివరి పోరాటమనే చెప్పాలి.


పార్వతీపురం నుంచి నాలుగు సార్లు గెలిచిన వైరిచర్ల 2009 ఎన్నికల్లో తొలిసారిగా అరకు  పార్లమెంట్ సీటు ఏర్పడినపుడు కాంగ్రెస్ నుంచి గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014లో విభజన తరువాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కిశోర్ దారుణంగా ఓటమి పాలు అయ్యారు. ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయడం ద్వారా తన అద్రుష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే అరకులో వైసీపీకి బలంగా గాలి ఈసారి వీచింది. పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అరకు, పాడేరు, సాలూరు, పార్వతీపురం, కురుపాంలలో వైసీపీ మెజారిటీ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో సులువుగానే ఈ సీటు వైసీపీ పరం అవుతుందని ఆ పార్టీ లెక్కలు వేస్తోంది.


ఈసారి ఎలాగైనా గెలవాలని కిశోర్ చంద్రదేవ్ పాత వైరాన్ని మరచి మరీ అందరినీ కలుపుకున్నారు. ముఖ్యాంగా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజుతోనూ నెయ్యం నెరిపారు. టీడీపీలో ఉన్న పాత నాయకులతోనూ సఖ్యతగా ఉంటూ తన విజయం కోసం పనిచేస్తే అన్నీ చూసుకుంటానని చెప్పుకున్నారు. ఇంకోవైపు విజయనగరం రాజు అయిన పూసపాటి అశోక్ వద్దకు స్వయంగా వచ్చిన కిశోర్ ఆయనతో కూడా మనస్పర్ధలు లేకుండా చేసుకున్నారు. ఇలా కాంగ్రెస్, టీడీపీ నాయకుల మధ్య సమన్వ్యయం  సాధించిన ఆయన వ్రుధ్ధాప్యంలోనూ  కష్టపడి ప్రచారం చేశారు. అయితే టీడీపీకి ఏజెన్సీలో పట్టు తక్కువగా ఉండడంతో కిశోర్ విజయం పైన అది తీవ్ర ప్రభావం చూపించిందని పోలింగ్ సరళి తెలియచేస్తోంది. మొత్తానికి మళ్ళీ గెలిచి ఎంపీతో పాటు పాటు, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి కావాలనుకున్న కిశోర్ ఆశలు ఎంత మేరకు ఫలించాయన్నది ఫలితాలే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: