తుపానులు తీర ప్రాంతానికి సర్వసాధారణమే అయినా ఈ మధ్య కాలంలో వస్తున్న తుపానులు మాత్రం భారీ విద్వంసం స్రుష్టిస్తున్నాయి. ఉత్తరాంధ్రాకు హుదూద్ ఓ పీడకలగా మారితే గత ఏడాది చివరలో వచ్చిన తిత్లీ శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. ఇపుడు ఫోనీ తుపాను దూసుకువస్తోంది. దాంతో ఉత్తరాంధ్రా  జిల్లావాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.


ఫొని పెను తుపాను ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ప్రభావం చూపనుందని ఐఎండీ తాజాగా  తెలిపింది. రేపు, ఎల్లుండి  ఈ రెండు జిల్లాల్లో పెనుగాలుల ఉధృతితో పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈనెల 4 వరకు తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంటుందని వివరించింది.రేపు  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో  భారీ వర్షాలు, ఎల్లుండి  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.


మొత్తానికి చూసుకుంటే పెను గాలులు ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 85–115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి . ఎల్లుండి, అవతల నాడు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. దాంతో ఈ మూడు జిల్లాల ప్రజానీకం ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలులుతో మళ్ళీ నాటి హుదూద్, తిత్లీ లాంటి భయానక సన్నివేశాలు దాపురిస్తాయా అని  ప్రజలు  కలవరపడుతున్నారు. నాలుగు రోజుల పాటు ఏక బిగిన ఇలా తుపాను తిష్ట వేయడం అన్నది ఈ మధ్యకాలంలో లేకపోవడంతో అధికారులు సైతం పెను నష్టం ఈ తుపాను కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: