జగన్ సీఎం ఈ మాటకు ఇంకా 22 రోజులు మాత్రమే దూరం ఉందని వైసీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ నెల 23న కౌటింగ్ జరుగుతుంది. జగన్ తప్పకుండా సీఎం అవుతారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ సైతం మొదటి నుంచి అదే విశ్వాసంతో ఉన్నారు. ఈసారి జనం, దేవుడు తనను నిండుగా దీవించారని జగన్ భావిస్తున్నారు.


దాంతో జగన్ తాను అధికారలోకి వస్తే చేయాల్సిన మొదటి పనులు ఏంటి అన్న దానిపైన యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నారు. అందులో భాగంగా ముందుగా జిల్లాల విభజనకు జగన్ శ్రీకారం చుడతారని పార్టీ వర్గాల సమాచారం దీనికి సంబంధించి అపుడే వర్క్ కూడా స్టార్ట్ అయిందని అంటున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడానికి మరో మూడు వారాల గడువు ఉంటుండగానే జిల్లాల విభజనకు వైసీపీ  సిద్ధపడినట్టు విశ్వసనీయ సమాచారంగా చెబుతున్నారు.


ఇప్పటికే ఆ పార్టీకి అనుకూలురైన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఆ బాధ్యతలను అప్పగించినట్టు తెలిసింది. ఆ ఇద్దరు అధికారులు రాష్ట్రంలో కొత్తగా ఎన్ని జిల్లాలు పెంచొచ్చు, వాటికి జిల్లా కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై సర్వే జరుపుతున్నట్టు సమాచారం. సార్వత్రిక ఫలితాలు వెలువడిన వెంటనే ఆ పార్టీ అధికారంలోకి వస్తే ముందర జిల్లాల విభజనకు శ్రీకారం చుట్టనుంది. జిల్లాల విభజన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.


ఒకవేళ జిల్లాలను విభజించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే జిల్లాలు పెంచేందుకు మరో ఐదేళ్లపాటు ఆగాల్సి ఉంటుందని, దానివల్ల రాజకీయ పునరావాసాలు ఉండవన్న ఆలోచనలో జగన్  ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వైసీపీ  అంచనా ప్రకారం రాష్ట్రంలో కొత్తగా మరో 17 జిల్లాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే ఏపీలో ముందుగా  కొత్త జిల్లాలు వస్తాయని తెలుస్తోంది ఇపుడున్న 13 జిల్లాలకు అదనంగా 17 కలుపుకుని మొత్తానికి 30 జిల్లాలతో  ఏపీలో పాలన  ఏర్పాటు అవుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: