చంద్రబాబునాయుడే ఎలక్షన్ కమీషన్ తో పెట్టుకుని ఏమీ చేయలేక మాట్లాడకుండా కూర్చున్నారు. ఇక మంత్రుల స్ధాయెంత ? అంటే, తనను తాను ఎక్కువగా ఊహించుకుంటే ఫలితమిలాగే ఉంటుందని వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవహారంలో తాజాగా స్పష్టమైంది.


సమీక్షలు జరపకుండా అడ్డుకునేందుకు ఎలక్షన్ కమీషన్ ఎవరన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సమీక్షలు జరపకుండా అడ్డుకునేందుకు ఎలక్షన్ కమీషన్ కు ఎవరిచ్చారు అధికారాలంటూ ఎగిరెగిరి పడ్డారు. తాను సమీక్ష చేస్తానని దమ్ముంటే అడ్డుకోవాలంటూ సవాలు విసిరారు. సీన్ కట్ చేస్తే మంత్రికి దిమ్మ తిరిగింది. ఎలక్షన్ కమీషన్ కున్న అధికారాలేంటో అర్ధమైంది.

 

ఇంతకీ ఏమి జరిగిందంటే చంద్రబాబునాయుడు, మంత్రులు ఎవరిని కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు ఉన్నతాధికారులతో సమీక్షలు జరపకూడదని ఈసి ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈసి ఆదేశాలను కాదని చంద్రబాబు పోలింగ్ అయిపోయిన రెండు రోజులు సమీక్షలు నిర్వహించారు. దాంతో ఈసికి ఒళ్ళు మండిపోయింది. చంద్రబాబు నిర్వహించిన సమీక్షలకు హాజరైన ఉన్నతాధికారులకు నోటీసులిచ్చింది ఈసి. దాంతో ఒక్కసారిగా అదిరిపోయిన యంత్రాంగం సమీక్షలకు హాజరయ్యేది లేదని ముఖ్యమంత్రి కార్యాలయంకు తేల్చి చెప్పేసింది.

 

పరిస్ధితి అర్ధమైన చంద్రబాబు కూడా చేసేదిలేక సమీక్షలను మానుకున్నారు. అదే సమయంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి హఠాత్తుగా పూనకమొచ్చింది. ఎలక్షన్ కమీషన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఈసి అధికారాలనే ప్రశ్నించారు. పరిధి దాటి ఈసి వ్యవహరిస్తోందంటూ వ్యాఖ్యానించారు. 30వ తేదీ శాఖాపరమైన సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. దమ్ముంటే తన సమీక్షను ఆపాలంటూ ఈసికి చాలెంజ్ విసిరారు.

 

అనుకున్నట్లే తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించనున్నట్లు సోమిరెడ్డి ఉన్నతాధికారులకు సమాచారం పంపారు. అందరూ హాజరుకావాలంటూ గట్టిగా చెప్పారు. అయితే ఉదయం 11 గంటలకు మొదలవ్వాల్సిన సమీక్ష ఎంతకూ మొదలుకాలేదు. దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకూ వెయిట్ చేసినా ఒక్క అధికారి కూడా హాజరుకాలేదు. దాంతో విషయం వాకాబు చేసిన మంత్రికి ఈసి కోడ్ ను అధికారులు గుర్తుచేశారు. దాంతో చేసేది లేక ఈసిని తిట్టుకుని, ఉన్నతాధికారులపై నోరు పారేసుకుని సచివాలయం నుండి సోమిరెడ్డి వెళ్ళిపోయారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: