ఈసారి ఎన్నికలు బాగానే జరిగాయని అంతా అనుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఈవీఎంలు మొరాయించాయని పోలింగు రోజే హాట్ కామెంట్స్ చేశారు. ఇలాంటి ఎన్నికలు తన జీవితంలో చూడలేదని కూడా ఆయన చెప్పేశారు. ఆయన ఎలా చెప్పినా తమ్ముళ్ళు మాత్రం ఎక్కడా ఫిర్యాదులు చేయలేదు. అంటే వారికి ఎన్నికలు బాగానే జరిగినట్లు లెక్క.


మరి విశాఖ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేసిన నార్త్ అసెంబ్లీ సీట్లో ఎన్నికలు సరిగ్గా జరగలేదని మొత్తం ఎన్నికను రద్దు చేయాలని ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వడ్డి హరి గణేష్ డిమాండ్ చేశారు. ఈ రోజు విశాఖలో మీడియా సమావేశం పెట్టి మరీ ఆయన రీపోలింగ్ కోరడం విశేషం. ఈ మేరకు రీపోలింగ్ కోరుతూ హై కోర్టులో కేసు కూడా వేశానని ఆయన వెల్లడించారు.


విశాఖ నార్త్ లో ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ మధ్యాహ్యం పన్నెండుకు కానీ మొదలు కాలేదని, ఈవీఎంలు ఎక్కడికక్కడ ఆగిపోయాయని హరి గణేష్ ఆ రిట్ పిటిషన్లో పేర్కొన్నాడు. సాయంత్రం ఆరు దాటాక గేట్లు మూసేసి ఉన్న ఓటర్లకే ఓటు వేసే అవకాశం ఇచ్చారని, దీని వల్ల చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని ఆయన అన్నారు. 


అంతే కాకుండా మాక్ పోలింగ్ లో కొన్ని స్లిప్పులని బయటకు తీయకుండా ఈవీఎంలలో రీసెట్ చేయకుండా వదిలేయడం వల్ల రెగ్యులర్ అయిన ఓట్లతో కలిసిపోయి ఓటర్ల స్లిప్పులకు, ఈవీఎంలో ఉన్న కౌంట్ కి తేడా వస్తోందని కూడా ఓ భయంకరమైన నిజాన్ని బయటపెట్టాడు. ఇక ఈ నియోజకవర్గంలో ఎడిషన్ ఓటర్ల లిస్ట్ లో ఒక్కొక్క ఓటరుకు ఎనిమిదేసి ఓట్లు ఉండడం పైన కూడా రిట్ పిటిషన్లో పేర్కొన్నట్లుగా వివరించాడు. 


అటువంటి ఓటర్లను ఎన్నికల సంఘం అధికారులు ఎలా అనుమంతించారని కూడా ఆయన ప్రశ్నించాడు. . ఎన్నికల సంఘం విశాఖ నార్త్ ఫలితాలను నిలిపివేసి వెంటనే రీపోలింగ్ చేపట్టాలని కూడా హరి గణేష్ డిమాండ్ చేశాడు. మరి మంత్రి గారు పోటీ చేసిన చోట ఈ అక్రమాల గురించి వైసీపీ, బీజేపీ కూడా ప్రశ్నించలేదు. ఆఖరుకు మంత్రి కూడా అవకతవకలు జరిగాయని చెప్పలేదు. మరి ఇండిపెండెంట్ అభ్యర్ధి రీపోలింగ్ అడుగుతూండడం విశేషమే. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: