టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉగ్ర‌రూపం దాల్చారు. తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలలో గ్లోబరినా ఐటీ సంస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ కుంభ‌కోణానికి బాధ్యుడిగా పేర్కొంటూ కేటీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. తాజాగా, తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో పాల్గొన్న కేటీఆర్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ విరుచుకుప‌డ్డారు. 


ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని తాను చెప్పినట్లు తెలిపారు. విద్యార్థులు తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. రూ. 4 కోట్ల 35 లక్షల 70 వేలకు గ్లోబరీనాకు టెండర్ దక్కింది. ఒకాయన 10 వేల కోట్ల స్కాం జరిగిందని అంటున్నడన్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదన్నారు.``ఐటీ మంత్రిగా ఉంటె నాకే సంబంధమా? రూ.4 కోట్ల టెండర్ ఉంటే.. రూ.10 వేల కోట్ల స్కామ్ అంటూ ఒకాయన సోయి లేకుండా మాట్లాడుతున్నారు`` అని రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పెద్దమ్మగుడికి రా అంటూ ఓ బఫున్ పిలుస్తున్నారంటూ వీహెచ్‌పై మండిపడ్డారు. ప్రతి పక్షాలు చిల్లర రాజకీయాలు చెయ్యొద్దు అని హెచ్చరించిన కేటీఆర్... ప్రతిపక్షాలకు చేతనైతే రాజకీయంగా ఎదుర్కోవాలి.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని విజ్ఞప్తి చేశారు. అడ్డుగోలుగా మాట్లాడితే ఊరుకోను.. అవసరమైతే పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. 


విద్యాశాఖకు సంబంధించిన అంశాన్ని ఐటీ శాఖకు లింకుపెడుతున్నారు.. దానితో సంబంధమేంటి..? టెండర్లు ఇచ్చింది ఇంటర్ బోర్డు కదా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఇంటర్ బోర్డు వ్యవహారంలో రాజకీయంగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తప్పు చేసిన వారిపై తప్పక చర్యలుంటాయని స్పష్టం చేసిన ఆయన.. నేనూ ఓ తండ్రినే.. పిల్లల భాద నాకు తెలుసన్నారు. తల్లిదండ్రులు, పిల్లలు ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విజ్ఞప్తి చేశారన్న కేటీఆర్... ఇంటర్‌ ఫలితాల విషయంలో ప్రభుత్వం డిఫెన్స్ లో పడిందన్నట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: