ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబునాయుడు తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీలు కొత్త డ్రెస్సులు వేస్తున్నారని మోడీ దిగజారి మాట్లాడుతున్నారని బాబు విమర్శించారు. డ్రెస్సుల మీద మోజు ప్రధాని మోడీకే ఉందన్న విషయం అందరికీ తెలుసన్నారు. 'గంటకో డ్రెస్‌ మార్చి మోడీ ఆర్భాటం చేస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌కో డ్రెస్సు, లంచ్‌కి మరో డ్రస్సు, మధ్యాహ్నం ఇంకో డ్రెస్సు వేస్తున్నారు. మోడీ చెప్పిన మార్పు డ్రెస్సులు మార్చడంలోనే కనబడుతోంది' అని సెటైర్లు వేశారు.

ప్రతిపక్షాలను చూపి మోడీ సహించలేకపోతున్నారని చంద్ర‌బాబు విమర్శించారు. మోడీ ఫ్రస్ట్రేషన్‌ పతాక స్థాయికి చేరిందని, బాలాకోట్‌ను పదేపదే ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. ఈనెల 23న ఫలితం ఎలా ఉండబోతోందో ఇప్పుడే ఆయనకు అర్థమైనట్టుందని ఎద్దేవాచేశారు. ఎన్నికలు ముగియగానే వ్యూహం ఖరారు చేస్తామని చెప్పాన బాబు.. తాను ప్రధాని రేసులో లేనని అన్నారు. 'ప్రధాని మాట్లాడేందుకు ఎలాంటి కోడ్ అడ్డంకిగా ఉండదు. కానీ.. బీజేపీయేతర ముఖ్యమంత్రులకు మాత్రం ఉంటుంది. దేశ ప్రధానికి ఒక రూలు.. సీఎంలకు ఒక రూలా? తుఫాన్లు వచ్చిన ముఖ్యమంత్రులు సమీక్షలు చేయకూడదంటే ఎలా? `` అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 


పశ్చిమ బెంగాల్ లో 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని మోడీ కామెంట్లు చేసినా ఈసీ పట్టించుకోదా అని చంద్ర‌బాబు నిల‌దీశారు.'తుఫాన్‌ ఉంటున్నా కోడ్ నుంచి వెసులుబాటు ఇవ్వరా..? ప్రజలంటే ఈసీకి అంత చులకనగా ఉందా..?' అని చంద్రబాబు ప్రశ్నించారు.  ఫొని తుఫాన్‌ ముప్పు ఉన్నా ఎన్నికల కోడ్‌ నుంచి వెసులుబాటు ఇవ్వడం లేదని.. ఒడిశాలోని తీర ప్రాంత జిల్లాలను కోడ్ నుంచి మినహాయించినట్టుగా ఏపీకీ కోడ్ నుంచి వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారు. గతంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ నేతలు.. ఇప్పుడు ఈవీఎంలను సమర్థిస్తున్నారని చంద్ర‌బాబు అన్నారు. ఈవీఎల విష‌యంలో ఒక్క ఏపీ గురించే మాట్లాడడం లేదని.. ఏపీతోపాటు పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లోనూ ఈవీఎంలు మొరాయించాయని బాబు గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా పారదర్శకత కోసమే వీవీప్యాట్‌లు వినియోగించాలని కోరుతున్నామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: