గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల్లో వీవీ పాట్స్ లెక్కింపు అన్నది ఓ  పెద్ద ప్రయత్నం కాబోతోంది. ఈ విషయంలో విపక్షాలు ఎన్నో పోరాటాలు చేసిన మీదట ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఎదుట ఎన్నికల సంఘం నియోజకవర్గానికి అయిదు వంతున లెక్కించడానికి అంగీకరించింది. అయితే దీని వల్ల అసలు ఫలితాలు వచ్చేసరికి బాగా ఆలస్యం అవుతుందని ఎన్నికల సంఘం అధికారులు  చెబుతున్నారు.


ఇక ఆ అయిదు వీవీ పాట్స్ లెక్కింపు కూడా ఎలా ఉండాలన్న దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. అమరావతిలో ఈ రోజు ఆయన విలెకరులతో మాట్లాడుతూ,   ప్రతి అసెంబ్లీకి ఐదు చొప్పున వీవీ ప్యాట్లను లెక్కించాల్సి ఉందన్నారు. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ పరిధిలో వేర్వేరుగా వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందని, ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాకే వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక దాని తర్వాత మరో వీవీప్యాట్‌ లెక్కింపు జరుగుతుందని వెల్లడించారు. నియోజకవర్గంలో ప్రతి పోలింగ్‌స్టేషన్‌కు ఒక్కో గుర్తింపు కార్డు ఇస్తారని తెలిపారు.


కార్డుపై వివరాలు కనిపించకుండా లాటరీ ద్వారా వీవీప్యాట్ల ఎంపిక చేస్తారని చెప్పారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో కంటైనర్‌ ద్వారా వీవీప్యాట్‌ కార్డుల ఎంపిక చేస్తామని వెల్లడించారు. వీవీప్యాట్‌ కార్డులు అందరికీ చూపిన తర్వాతే లాటరీలో వినియోగిస్తామని అన్నారు. ఆర్‌ఓ, అభ్జర్లవర్ల సమక్షంలోనే వీవీప్యాట్‌ స్లిప్పుల కౌంటింగ్‌ ఉంటుందని స్పష్టం చేశారు. ఈవీఎం ఓట్లు, వీవీ ప్యాట్‌ స్లిప్పుల్లో తేడా వస్తే మ్యాచ్‌ అయ్యేవరకు రీకౌంటింగ్‌ చేస్తామని పేర్కొన్నారు. ఈవీఎం, వీవీప్యాట్‌ లెక్కలు సరిపోలకపోతే వీవీప్యాట్లో వచ్చిన ఓట్లే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తానికి వీవీ పాట్ల వల్ల ఎంతవరకూ ప్రతిపక్షాల డౌట్లు తీరుతాయో తెలియదు కానీ  ఎన్నికల ఫలితాలు మాత్రం గతానికి భిన్నంగా చాలా ఎక్కువగా ఆలస్యం అయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: