తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుని అంతా రాజకీయ చాణక్యుడు అంటారు. ఆయన ఏది చేసినా దానికి ఓ పధ్ధతి ఉంటుంది. ఆయన వ్యూహాలు  సాటి లేనివి, తిరుగులేనివి. ఆయన తలచుకుంటే విజయమే తప్ప రెండో మాటే ఉండదు. బాబు మొత్తం రాజకీయ చరిత్రలో తీసుకుంటే ఆయన తన ఎత్తులు పై ఎత్తులతో ఎపుడూ గెలుపు బాటనే ఉండడం ఎక్కువగా కనిపిస్తుంది.


అయితే అపుడపుడు బాబు వ్యూహాలు గురి తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి ఉదాహరణ 2009 ఎన్నికలు. అప్పట్లో ఉమ్మడి ఏపీలో  వైఎస్ ని దించడానికి టీయారెస్ తో బాబు పొత్తు పెట్టుకున్నారు. అలాగే వామపక్షాలతో కూడా ఆయన  జతకట్టారు. మొత్తానికి మహా కూటమి అంటూ రెడీ చేసి ఢీ కొట్టారు. అయినా రిజల్ట్ ఉల్టాగా అయింది. . చివరికి వైఎస్ గెలిచారు చంద్రబాబు ఘొర పరాజయం పాలు అయ్యారు. అదే చంద్రబాబు 2014 ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీతో పొత్తుకు రెడీ అన్నారు.



మోడీ బాబు జోడీ సూపర్ అంటూ ప్రచారం చేసుకున్నారు. మొత్తానికి హిట్ కొట్టారు. పదేళ్ళ పాటు అధికారానికి దూరమైన బాబు విభజన ఏపీలో చక్రం తిప్పేశారు. జగన్ని ఓడించి మరీ ముఖ్యమంత్రి అయిపోయారు. ఇక తాజా ఎన్నికల్లో మాత్రం బాబు అంతా రాంగ్ చేసుకుంటూ పోయారని ఇపుడిపుడే తత్వం బోధపడుతోందట. బాబు చేసిన అతి పెద్ద తప్పు అదేనట. నాలుగేళ్ళ పాటు మోడీతో కలసి ఉన్న చంద్రబాబు ఎన్నికల వేళకు విడిపోవడం అతి పెద్ద తప్పిదంగా ఇపుడు  తాపీగా  భావిస్తున్నారుట.


దీని వల్ల బాబు మొత్తం పట్టు కోల్పోయారని, ఆయనకు కేంద్ర సాయం ఈ ఎన్నికల్లో అసలు లేకుండా పోయిందని తీరిగ్గా వాపోతున్నారు. బాబు, మోడీ కలసి ఉంటే జగన్ కి ఇంత అడ్వాంటేజ్ వచ్చేది కాదని, ఎన్నికలు బాబు అనుకున్నట్లుగా జరిగేవని టీడీపీ శిబిరంలో వినిపిస్తున్న మాట. ఇక మోడీ గ్రాఫ్ పడిపోతోందని వేసిన అంచనా కూడా తప్పు అని అంటున్నారు. 


మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం కూడా ఈ ఎన్నికల్లో బూమరాంగ్ అయిందని పసుపు శిబిరం విశ్లేషిస్తోంది. మొత్తానికి బాబుని, మోడీని విడదీసి జగన్ తన వ్యూహాన్ని చక్కగా అమలుచేశాడనుకోవాలేమో.  మళ్ళీ మోడీ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కూడా టీడీపీలోనే వాదన ఉందంటే బాబు ఎంతటి రాంగ్ స్టెప్ వేశారో కదా అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: