ఎన్నికల్లో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. తన అభ్యర్ధులను గెలిపించుకోవటానికి చంద్రబాబునాయుడు కూడా చేయాల్సినవి, చేయకూడని పనులు  కూడా చేశారు. ఇందుకోసం సర్వ వ్యవస్ధలను భ్రష్టుపట్టించేశారు. ఇదే విషయమై ఎన్ని ఆరోపణలు, విమర్శలు ఎదురైనా చంద్రబాబు ఏమాత్రం లెక్కచేయలేదు. అయినా గెలుపుపై అందరిలోను అనుమానమే. అందుకనే చేసేది లేక చివరకు భగవంతుడిపై భారమేసేసి గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్నికలు ముగిసినాయి కదా ? గెలుపోటములపై ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. సరే ఎంతమంది లెక్కలేసుకున్నా, ఎన్నిసార్లు లెక్కలేసుకున్నా ప్రజా తీర్పయితే ఇచ్చేశారు. ఈనెల 23వ తేదీ జడ్జిమెంట్ డే అని కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి కొత్తగా ఎవరూ ఏమీ చేసేది కూడా లేదు.

 

అయినా సరే అన్నీ తెలిసినా కానీ ఎక్కడో ఓ మూల పీకుతునే ఉంటుంది. అందుకనే టిడిపి అభ్యర్ధుల్లో చాలామంది పుణ్యక్షేత్రాలు పట్టుకుని తిరుగుతున్నారు. అభ్యర్ధుల్లో చాలామంది అసలుకు విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారట. కానీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే బయటదేశాలకు వెళ్ళనపుడు తామెళితే ఏం ముంచుకుపోతుందో అన్న భయంతో ఇక్కడే ఉండిపోయారు.

 

అందుకనే కుటుంబాలతో కలిసి తిరుపతి, షిరిడీ లాంటి పుణ్యక్షేత్రాలకు క్యూలు కట్టారు. భక్తుల మొక్కులు తీర్చటంలో తిరుపతి వెంకన్నకు, షిరిడీ సాయిబాబాకు ట్రాక్ రికార్డు బాగానే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే పోలోమంటూ చాలామంది పై పుణ్యక్షేత్రాలకు వెళుతున్నారు.

 

అభ్యర్ధుల్లో చాలామంది ఇప్పటికే పై రెండు క్షేత్రాలకు వెళ్ళి మొక్కులు మొక్కుకుని వచ్చేశారట. వెళ్ళాల్సిన వాళ్ళు కూడా మరో వారం, పది రోజుల్లో రెడీ అయిపోతున్నారు దర్శనాలకు. అభ్యర్ధుల వరస చూస్తుంటే తాము చేయాల్సిందంతా చేసేశాము కాబట్టి ఇక చేయాల్సిందేమన్నా ఉంటే తిరుపతి వెంకన్నదో లేకపోతే షిరిడీ సాయినాధుడి మీదే వేసేసినట్లే కనిపిస్తోంది. చూద్దాం పై ఇద్దరు దేముళ్ళు ఏం చేస్తారో ?


మరింత సమాచారం తెలుసుకోండి: