దూసుకువస్తున్న ఫోనీ తుపాను మరో మారు శ్రీకాకుళం జిల్లా పైనే పగ పట్టేసింది. సరిగ్గా ఆరు నెలల క్రితం తిత్లీ  తుపాన్ రూపంలో శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసి వెళ్ళింది. ఇపుడు ఫోనీ తుపాను మళ్ళీ అక్కడే తిష్ట వేయడంతో జిల్లావాసులు వణికిపోతున్నారు. తీరం వైపు వేగంగా దూసుకువస్తున్న ఫోనీ తుపాను పెను విద్వంసం స్రుష్టించేందుకు సిధ్ధంగా ఉంది.


ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో భయానక వాతావరణం అలముకునిఉంది. ఇక్కడ సముద్రం 20 నుంచి పాతిక మీటర్ల ముందుకు రావడంతో తీర ప్రాంత వాసులు బెంబేలెత్తుతున్నారు. అతి తీవ్ర తుపానుగా మారిన ఫోనీ తన విశ్వరూపాన్నే చూపిస్తోంది. ఇవాళ సాయంత్రం కానీ, అర్ధ రాత్రి కానీ ఫోనీ  తీరం దాటనుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు సమాచారం అందించారు.  దీంతో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముంది. 


ఇదిలా ఉండగా తీరం దాటే సమయంలో శ్రీకాకుళానికి పెను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో మోస్తరుగా వానలు కురుస్తున్నాయి. రాత్రికి మాత్రం మూడు జిల్లాలలోనూ  భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలియచేస్తున్నారు.


ఇక ఫోనీ తుపాన్ ఎఫెక్ట్ ఒడిషా మీద‌ దారుణమైన ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇపుడు ఒడిషాలో హై అలెర్ట్ ప్రకటించారు. ఎండీఆరెఫ్ టీములను రంగంలోకి దింపారు. ఇక్కడ గంటకు 22 కిలోమీటర్ల వేగంతో ఫోనీ తుపాను కదులుతోందని, అంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: