గత కొంత కాలంతా ఏపిలో ప్రతియేటా తుఫానులు విజృంభిస్తున్నాయి..ఆస్తి నష్టం..ప్రాణ నష్టాన్ని కల్పిస్తున్నాయి.  హుదూత్ తుఫాన్ మొదలు నేటి ఫొని తుఫాన్ వరకు ఏపి ప్రజలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి.  ఇప్పటికే ఉధృతమైన గాలులతో పంట నష్టం..ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే.  ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను మంగళవారం ఉదయం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇది బుధవారం నాటికి భయంకర రూపం(ఎక్‌స్ట్రీమ్లీ సివియర్‌ సైక్లోన్‌) దాలుస్తుందని భారత వాతావరణ అధ్యయన శాఖ(ఐఎండీ) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 


కాగా,  వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతున్న ఫొని బుధవారం దిశ మార్చుకొని ఉత్తర-ఈశాన్య దిశగా ఒడిశాకు చేరువవుతుంది.  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఫొణి పెను తుఫాను కొనసాగుతోంది. ఒడిశా లోని పూరికి దక్షిణ నైరుతి దిశగా 510 కిలో మీటర్లు, విశాఖకు దక్షిణ ఆగేయ దిశగా 260 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. గంటకు 7 కిలో మీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ.. ఒడిశా తీరం వైపు తుపాను దూసుకెళుతోంది. శుక్రవారం (రేపు) మధ్యాహ్నం గోపాల్‌ పూర్‌, చాంద్‌ బలి మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు ప్రారంభమయ్యాయి.


ఈ మధ్యాహ్నానికి గాలుల వేగం పెరిగి, భారీగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.   శ్రీకాకుళం జిల్లా సరిహద్దు దాటే సమయంలో 130 కి.మీ. పొడవున తుఫాన్‌లో కొంత భాగం భూఉపరితలంపై పయనించనుంది. దీనివల్ల శ్రీకాకుళం జిల్లాలో పెనుగాలులు వీయడంతోపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి.  సముద్రపు అలలు మీటరు నుంచి 2మీటర్ల వరకూ ఎగిసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.


తుఫాన్‌ ప్రభావంతో కోస్తాలో బుధవారం మేఘాలు ఆవరించి, అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి ఈదురు గాలులు ప్రారంభమయ్యాయి.  తుఫాన్‌ కదలికలను ఆర్టీజీఎస్‌ నుంచి కూడా నిరంతరం గమనిస్తున్నారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల ప్రజలను, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. పూరి దగ్గర తీరం దాటిన తర్వాత తీరంవెంట ఎక్కువసేపు పయనించి పశ్చిమ బెంగాల్‌ వైపు వెళ్తుందని అంచనా వేస్తున్నారు. 


ఇక ఫొని తుఫాన్ వల్ల ప్రభావితమవుతున్న ప్రాంతాలు.. శ్రీకాకుళం జిల్లాలోని గార, ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, సంతబొమ్మాళి, పలాస, పొలాకి, నందిగం, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం మండలాలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాలపై ప్రభావం ఉంటుందని ఆర్టీజీఎస్‌ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: