ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డేందుకు మ‌రో 20 రోజుల టైం ఉన్నా అప్పుడే వైసీపీలో హ‌డావిడి స్టార్ట్ అయిపోయింది. ఎన్నిక‌ల త‌ర్వాత ప్రీపోల్ ఎగ్జిట్‌పోల్స్‌తో పాటు ప‌లు స‌ర్వేలు, మీడియా సంస్థ‌ల అంచ‌నాలు, మేథావులు చెపుతోన్న దానిని బ‌ట్టి వైసీపీ అధికారంలోకి రావ‌డం దాదాపు ఖాయ‌మైంది. గెలుస్తామ‌న్న ధీయాతో ఉన్న వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే క్యాండెట్స్ అప్పుడే విదేశీ ట్రిప్‌లు కూడా వేసేస్తున్నారు. మ‌రి కొంద‌రు ఇదే ఉత్సాహంతో ద్వితీయ శ్రేణి టీంను కూడా టూర్ల‌కు పంపుతున్నారు.


ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఇప్ప‌టికే త‌మ‌కు మంత్రి ప‌ద‌వులు వ‌చ్చేస్తున్నాయ‌న్న లెక్క‌లు వేసుకుంటున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లోనూ చాలా మంది గెలుపు, ఓట‌ముల సంగ‌తి తేల‌కుండానే త‌మ‌కు జ‌గ‌న్ కేబినెట్‌లో బెర్త్ ఖాయ‌మైపోయింద‌ని త‌మ అనుచ‌రుల‌తో చెప్పుకుని మురిసిపోతున్నారు. కొంద‌రు సీనియ‌ర్లు త‌మ సీనియార్టీ కోటాలోనూ, మ‌రి కొంద‌రు జ‌గ‌న్ కోసం చేసిన త్యాగాల గురించి చెప్పుకుని, మ‌రి కొంద‌రు ప్రాంతీయ‌త‌, సామాజిక స‌మీక‌ర‌ణలు బేరీజు వేసుకుని జ‌గ‌న్ కేబినెట్‌లో బెర్త్ ఖాయ‌మంటున్నారు.


వాస్త‌వంగా చూస్తే జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వి కావాల‌న్న కుతూహ‌లంతో ఉన్న వారి సంఖ్య 40 పైమాటే. వీరిలో గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రులుగా ఉన్న వారు, జ‌గ‌న్ కోసం మంత్రి ప‌ద‌వులు వ‌దులుకున్న వారు ఇలా చాలా మందే ఉన్నారు. వాస్త‌వంగా జ‌గ‌న్ మాత్రం మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి మాత్ర‌మే మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పారు. చాలా మంది మంత్రి ప‌ద‌వి త‌మ‌కంటే త‌మ‌కంటూ మీడియాకు లీకులు ఇస్తుండ‌డంతో ఈ మ్యాట‌ర్ ఆ నోటా ఈ నోటా జ‌గ‌న్‌కు చేర‌డంతో ఇలా అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తోన్న త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌కు పార్టీ సీనియ‌ర్ల ద్వారా వార్నింగ్‌లు ఇప్పించిన‌ట్టు తెలుస్తోంది.


ఈ అతి ప్ర‌చారంపై సీరియ‌స్ అయిన జ‌గ‌న్ ఎవ్వ‌రూ అతి ధోర‌ణికి పోవ‌ద్ద‌ని చెప్పార‌ట‌. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా వైసీపీ అధికారంలోకి వ‌చ్చేస్తుంద‌ని.. తామే మంత్రి అవుతున్నామ‌ని చాలా మంది చెప్పుకున్నారు. తీరా ఫ‌లితాలు వ్య‌తిరేకంగా వ‌చ్చాయి. ఇప్పుడు ఇలా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌కు వెళ్ల‌కుండా ఫ‌లితాల త‌ర్వాతే మాట్లాడాల‌ని.. ఎవ్వ‌రూ త‌మ‌కు తామే మంత్రి ప‌ద‌వులు వ‌చ్చేస్తున్నాయ‌ని ప్ర‌క‌టించుకోవ‌ద్ద‌ని.. మ‌రోసారి ఇలాంటి సంఘ‌ట‌న‌లు రిపీట్ కానివ్వ‌వ‌ద్ద‌ని వార్నింగ్ ఇప్పించిన‌ట్టు వైసీపీలోనే ఇన్న‌ర్ టాక్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: