రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు కాస్త సంయమనం పాటించాలి. ప్రత్యేకించి మహిళా నేతలపై మాట్లాడే సమయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. తాజాగా ఓ వైసీపీ నేత టీడీపీకి చెందిన ఓ మహిళా నేత గురించి మాట్లాడిన మాటలు వాంఛనీయం కాదు.. 


వైసీపీ నేత సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ... లోకేష్‌ కోసం యామిని, యనమల కోసం కుటుంబరావు మీడియా ముందుకు వస్తున్నారని, మరి చంద్రబాబు కోసం ఎవరు వస్తారని ఎద్దేవా చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే శ్రుతి తప్పింది. 

అసలు లోకేష్‌కు, యామినికి మధ్య ఉన్న సంబంధం ఏమిటని సుధాకరబాబు ప్రశ్నించారు. ఎందుకు యామిని పెట్రేగిపోతూ.. అర్థం లేకుండా మాట్లాడుతుందంటూ మండిపడ్డారు. రాజకీయమంటే తప్పును నిజాయితీగా ఒప్పుకోవడం, ప్రజల ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పుకోవడమని తెలుసుకోవాలన్నారు. 

చంద్రబాబు లాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చూడలేదని, మరో 20 రోజుల్లో దాష్టికాలకు, దుర్మార్గాల అంతం జరగబోతుందని సుధాకర్ బాబు అన్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. లోకేశ్ కూ యామనికీ ఏంటి సంబంధం అని వైసీపీ నాయకుడు ప్రశ్నించడం బాగోలేదు. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారైనప్పుడు ఒకరి తరపున మరొకరు మాట్లాడితే దాన్ని తప్పుబట్టడం సబబుగా కనిపించలేదు. ఏదేమైనా ఈ విషయంలో వైసీపీ నేత విమర్శల తీరు సరిగ్గాలేదనే చెప్పాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: