కట్టుబట్టలతో తరిమేశారని చెబుతారు. లోటు బడ్జెట్ తో రాష్ట్ర విభజన చేశారని అంటారు.  సమయం, సందర్భం లేకుండా ఎప్పుడు చూసినా బీద మాటలే మాట్లాడుతుంటారు. కానీ అమరావతి నుండి కాలు బయటపెట్టాలంటే మాత్రం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు లేందే కదలరు. ఈ పాటికే అర్ధమైపోయుంటుంది ఎవరి గురించో ? అవును ఆయనే చంద్రబాబునాయుడు

 

గడచిన ఐదేళ్ళల్లో చంద్రబాబు ఉపయోగించిన ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాల రూ 100 కోట్లు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసుండరు విమానాలు, హెలికాప్టర్ల ప్రయాణాలపై. అంటే వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో చంద్రబాబు షోకులు చేసుకున్నారన్నమాట. ఒక్కోసారి అమరావతిలోని కరకట్ట క్యాంపు ఆఫీసు నుండి ఇటు గన్నవరంకు అటు సచివాలయంకు కూడా హెలికాప్టర్ ఉపయోగించిన సందర్భాలు చాలానే ఉన్నాయంటే ఎవరూ నమ్మరు.

 

 విచిత్రమేమిటంటే విదేశాలకు వెళ్ళటానికి కూడా చంద్రబాబు ప్రత్యేక విమానాలనే ఉపయోగించారు. ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్ళటమంటే ఒక్క ప్రధానమంత్రి, రాష్ట్రపతికి మాత్రమే సౌకర్యం ఉంది. మిగిలిన కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు విదేశాలకు వెళ్ళాలన్నా మామూలు ప్యాసెంజర్ విమనాల్లోనే వెళతారు. రెగ్యులర్ ప్యాసెంజర్ విమానాల్లో వెళ్ళటానికి చంద్రబాబు ఇష్టపడలేదు ఎందుకంటే మనది పేద రాష్ట్రం కాబట్టి.

 

మొదటిసారి చంద్రబాబు సింగపూర్ కు ప్రత్యేక విమానంలో వెళ్ళినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. అధికారులు అభ్యంతరం చెప్పినా చంద్రబాబు వినలేదట. దాంతో వాళ్ళు కూడా అడ్డు చెప్పటం మానుకున్నారు. ఇక అప్పటి నుండి తనిష్టం వచ్చినట్లు చంద్రబాబు ప్రత్యేకాలను వాడుకోవటం మొదలెట్టారు. చివరకు రాష్ట్రంలోని ఏ జిల్లాకు వెళ్ళాలన్నా అయితే ప్రత్యేక విమానం లేకపోతే హెలికాప్టర్ అంతే.

 

సిఎం అయిన కొత్తల్లో ఢిల్లీకి రెగ్యులర్ విమానాల్లో టికెట్లు బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయట. చివరి నిముషంలో క్యాన్సిల్ చేసుకున్న టికెట్ల విలువే లక్షల్లో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక విమానాల్లో ప్రయాణించటమన్నది చంద్రబాబుకు ఓ వ్యసనం అయిపోయిందట. ఎక్కడెక్కిళ్ళినా ప్రత్యేక విమానాల్లో వెళుతూ డాబు, దర్పం ప్రదర్శిస్తు తమది పేద రాష్ట్రమని అప్పుల్లో కూరుకుపోయిందని చెబితే ఎవరైనా నమ్ముతారా ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: