తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మీడియా దిగ్గ‌జం రామోజీరావు సార‌థ్యంలోని ఈనాడును టార్గెట్ చేయ‌డం మొదలుపెట్టారా? గ‌త కొంత‌కాలంగా తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు బాకా ఊదే ప‌త్రిక‌లు అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న టీఆర్ఎస్ పెద్ద‌లు ఇప్పుడు ఏకంగా ప్ర‌త్య‌క్ష దాడికి దిగాయా? అందులో ట్రైల‌ర్‌ను తాజాగా మొద‌లుపెట్టాయా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి.


టీఆర్ఎస్ పార్టీకి చెందిన అన‌ధికార గెజిట్ అనే పేరున్న `న‌మ‌స్తే తెలంగాణ‌`దిన‌ప‌త్రిక‌లో ఈనాడును టార్గెట్ చేస్తూ తీవ్ర ఎదురుదాడి చేశారు. ఏటిగడ్డ కిష్టాపూర్ విషయంలో బుధవారం రాష్ట్ర హైకోర్టు తీర్పును పేర్కొంటూ, ఈనాడు రాసిన క‌థ‌నంపై విరుచుకుప‌డింది. ``హైకోర్టులో జరిగిందొకటి.. న్యాయమూర్తులు ఇచ్చిన ఆదేశాలు మరొకటి. ఈనాడు దినపత్రిక మాత్రం రెచ్చిపోయింది. అబద్ధాల తాలింపును అక్షరాల్లో కుమ్మరించింది. తెలంగాణ ప్రాజెక్టులపై ఈనాడుకు ఎంత అక్కసు ఉన్నదో, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏమన్నా ఆదేశాలు వస్తాయోనని ఎంతగా తహతహలాడిపోతున్నదో సదరు వార్త చదివితే అర్థమవుతుందని పలువురు తెలంగాణవాదులు చెప్తున్నారు. `` అంటూ డైరెక్ట్‌గానే పేరు పెట్టి ఈనాడుపై విరుచుకుప‌డింది.
``ఏటిగడ్డ కిష్టాపూర్‌ను ఖాళీ చేయాలని హైకోర్టు చెప్పినట్టు ఈనాడు మొదటిపేజీలో బ్యానర్ వార్త రాసింది. కానీ హైకోర్టు ఎక్కడా ఆ విషయం చెప్పలేదు. యంత్రాలు, అధికారులు ఆ దరిదాపుల్లో ఉండొద్దని ఆదేశించినట్టు ఈనాడు పేర్కొంది. కానీ హైకోర్టు న్యాయమూర్తులు ఆ విషయం చెప్పలేదు. హైకోర్టు చెప్పిన విషయాలేవీ ఈనాడులో రాయలేదు. ఈనాడు రాసిన విషయాలేవీ ఇవ్వాళ ఏ పత్రికలూ రాయలేదు. ఈనాడుకు మాత్రమే ఏటిగడ్డ కిష్టాపూర్ ఖాళీ చేయమని హైకోర్టు చెప్పినట్టు కలవచ్చిందా? అలా కావాలని ఈనాడు కోరుకుంటున్నదా? తెలంగాణ ప్రాజెక్టులు ఆగిపోవాలని తహతహలాడుతున్నదా? ఈనాడు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. పోలవరం ప్రాజెక్టుపై ఈనాడు ఇలాగే రాస్తుందా? సగం పనికూడా కాకముందే పోలవరం ప్రాజెక్టు వైభవాన్ని పులకించి వేనోళ్ల కొనియాడిన ఈనాడుకు.. మల్లన్నసాగర్ అంటే అంత మంట ఎందుకుండాలి? దీనికి ఈనాడు పత్రిక సమాధానం చెప్పాలి`` అని ఈనాడు దోర‌ణిపై మండిప‌డింది. 
``ఏ అక్కసు? ఏ సంకుచితం? ఏ కడుపుమంట? ఇటువంటి రాతలకు కారణమవుతున్నది? తెలంగాణ ప్రాజెక్టులు ముందు పడకూడదా? కోర్టు చెప్పని మాటలను, న్యాయమూర్తులు అనని మాటలను పత్రిక పతాక శీర్షికల్లో రాయడానికి ఎంత దుస్సాహసం కావాలి? కోర్టు ధిక్కారం కిందికి వస్తుందన్న భయం కూడా లేదా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదే పత్రిక ఆంధ్రా ప్రాజెక్టుల విషయంలో ఏవైనా తిట్లు వస్తే ఎలా దాచిపెడుతుందో అందరికీ తెలిసిన విషయమే``అని వ్యాఖ్యానించింది. ఈనాడుపై గులాబీ ప‌రివారం మొద‌లుపెట్టిన ఈ దాడి ప‌ర్య‌వ‌సనాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: