ప్రముఖ దిన పత్రిక ఈనాడులో గురువారం వచ్చిన కథనంపై నమస్తే తెలంగాణ అక్షర దాడి కొనసాగిస్తోంది. శుక్రవారం ఈనాడుపై మెయిన్‌ పేపర్‌లో దాదాపు అరపేజీ బ్యానర్ వార్త ప్రచురించిన నమస్తే తెలంగాణ రెండో రోజు.. ఆ రేంజ్‌లో కాకపోయినా దాడి మాత్రం కొనసాగించింది. మల్లన్నసాగర్ విషయంలో ఈనాడు పత్రిక అసలు ఉద్దేశం నిర్వాసితులకు పరిహారం అందటమేనా? లేక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆగిపోవటమా? అంటూ ప్రశ్నించింది. 


ఈనాడు వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. ప్రాజెక్టు పనులు ఆపడమే దాని రహస్య అజెండాగా కనిపిస్తున్నదని.. అందుకే ప్రాజెక్టులో అత్యంత కీలకమైన గుండెకాయలాంటి మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై హైకోర్టు చెప్పని విషయాలు ప్రచురించి విషాన్నిగక్కిందని తెలిపింది. శుక్రవారం కూడా
మరోసారి మల్లన్నసాగర్‌పై తన దుగ్ధను ప్రదర్శించిందని నమస్తే తెలంగాణ ఆరోపించింది. ప్రాజెక్టు పనులను ఆపేయాలని హైకోర్టు చెప్పినట్టు, అయినా

తెలంగాణ ప్రభుత్వం పనులు కొనసాగిస్తున్నట్టు శుక్రవారం పత్రికలో మరో ఫొటో ప్రచురించిందని మండిపడింది. ఈనాడు పత్రిక తెలంగాణపై కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నదనడానికి ఈ వరుస వార్తాకథనాలే తార్కాణమని తెలంగాణవాదులు భావిస్తున్నట్టు నమస్తే తెలంగాణ వ్యాఖ్యానించింది.  హైకోర్టు ఏమీ అనకపోయినా, ఈనాడు పత్రికే పంతంపట్టి ఈ ప్రాజెక్టును ఆపించాలన్న కుట్రతో వ్యవహరిస్తున్నట్టు ఈ కథనాలు తెలియజేస్తున్నాయని వారు పేర్కొంటున్నట్టు రాసుకొచ్చింది. 

ఇంత కీలకమైన ప్రాజెక్టుకు ఏదో రకంగా అవరోధాలు సృష్టించాలని కొందరు చిల్లర పంచాయితీలు, కిరికిరీలు చేస్తున్నారని... ఇదే అదనుగా ఈనాడు పత్రిక రెచ్చిపోయి.. ఉన్నవీ లేనివీ వండివార్చే కార్యక్రమం పెట్టుకున్నదని తన పత్రికలో నమస్తే  తెలంగాణ రాసుకొచ్చింది. పోలవరం ప్రాజెక్టుపై ఏనాడూ ఒక్క ప్రతికూల వార్త రాయడానికి మనసురాని ఈనాడు.. తెలంగాణ ప్రాజెక్టులపై సందర్భం వచ్చిన ప్రతిసారీ విషం కక్కుతూనే ఉన్నదని ఆరోపించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: