ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీఎం చంద్రబాబు మరోసారి పైర్ అయ్యారు. ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఆయన్ను అడుక్కోవాలా.. అంటూ తీవ్రస్థాయిలో కామెంట్లు చేశారు. ప్రకృతి విపత్తులు వంటివి సంభవించినప్పుడు అన్ని రాష్ట్రాల్లో సీఎస్‌లు వెళ్లి ముఖ్యమంత్రికి పరిస్థితులు వివరిస్తుంటే.. ఏపీ సీఎస్ ఎందుకు రావడం లేదని మండిపడ్డారు. 


నేను వెళ్లి ఆయన్ను అడుక్కోవాలా? ఆయనకు తెలియదా? చదువుకోలేదా? రాజ్యంగంలో ఎవరి పరిధులేంటో? ఎన్నికల విధులేంటో, ఎన్నికేతర పాలనా విధులేంటో తెలియవా?.. బిజినెస్ రూల్స్ తెలియవా..  అని మండిపడ్డారు. అంతే కాదు..అధికారుల తీరుపై మంత్రివర్గ సమావేశం నిర్వహించి పరిస్థితులు  రివ్యూ చేస్తానన్నారు. 

ఇక్కడ వ్యక్తులు ముఖ్యంకాదు. వ్యవస్థలకు ఎవరూ అతీతులు కారు. అనుభవం కలిగిన వ్యక్తిగా వ్యవస్థల్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో అధికారులు ఇష్టానుసారం ప్రవర్తిస్తాం, సమీక్షలు, సమావేశాలకు రామంటే కుదరదు. రోజువారీ పాలనా వ్యవహారాల్ని, పరిణామాల్ని కూడా ఈసీకే రిపోర్టు చేస్తారా? ఈసీ ఏమైనా బిజినెస్‌ రూల్స్‌ మార్చిందా? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏ అధికారి అయినా బాధ్యతా రాహిత్యంతో ప్రవర్తిస్తే... బాధ్యత గుర్తు చేయడం నా విధి. ఈ సీఎస్‌ మూడు నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు.. మా పార్టీ 22 ఏళ్లు అధికారంలో ఉంది. నేను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. చాలా ఎన్నికలు చూశాను. ఇవే మొదటి ఎన్నికలూ కావు, చివరి ఎన్నికలూ కాదు. ఈసీ కూడా నిబంధనల ప్రకారమే పనిచేయాలి. ఎన్నికల సంఘం కాబట్టి మేం చెప్పిందే వేదం... అందరూ దాన్నే అనుసరించాలని చెప్పడం... మేం చెప్పింది మీకు మాత్రమే వర్తిస్తుంది, మిగతావాళ్లకు కాదన్నట్టుగా వ్యవహరించడం సరికాదు అని అధికారులను ఉద్దేశించి చంద్రబాబు కామెంట్ చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: