తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపొంది స్వ‌ల్ప‌కాలంలోనే పార్టీ మారిన‌ ఎమ్మెల్యేల‌కు ఊహించ‌ని షాకులు త‌గులుతున్నాయి. ప్ర‌చారంలో వారు ఊహించ‌ని రీతిలో నిర‌స‌న‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా నాయక్‌కు అలా నిరసన సెగ తగిలింది. ఆమె పార్టీ మారడంపై అసహనంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు.. ప్రచారం అడ్డుకోగా... దీంతో కాంగ్రెస్ -టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణకు దారితీసింది. 


ఇల్లెందు నియోజకవర్గం ఎమ్మెల్యే హ‌రిప్రియా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ పార్టీలో ఇటీవల చేరారు. కామేపల్లి మండలం గోవింద్రల గ్రామంలో ఈ ఉదయం ఎమ్మెల్యే హరిప్రియ పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అయితే,ఎమ్మెల్యే హరిప్రియ పార్టీ మారడంపై అసహనంతో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు… ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ శ్రేణులు ఆమె ప్రచారాన్ని అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపైకి మరొకరు రాళ్లు విసురుకున్నారు. పోలీసులు కూడా కొద్దిసేపు ఏం చేయలేకపోయారు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో పోలీసులు భారీగా చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు పంపించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: