ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు గురించి కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు నిప్పులు చెరిగారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి సాధించింది శూన్యం...చేసిన నష్టమే ఎక్కువ అని ఆరోపించారు. పోలవరం నిర్మాణం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని నష్టం జరిగిందని మండిప‌డ్డారు. ఏపీ ముఖ్యమంత్రి స్వార్థం కోసం రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడి, మరికొంత కాలం గొడవలు పెట్టుకుని, మీవల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని నమ్మి అధికారం కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు.


రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి స్వప్రయోజనాలే లక్ష్యంగా పోలవరం నిర్మాణాన్ని ఏపీ ముఖ్యమంత్రి తన చేతుల్లోకి తీసుకున్నారని కేవీపీ ఆరోపించారు. విభజన వల్ల ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీకి కేంద్రం నుంచి ఆర్ధిక తోడ్పాటును పొందేందుకు నేను చేస్తున్న ప్రయత్నానికి ముఖ్యమంత్రి కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం విషయంలో రాష్ట్ర పై అదనపు భారం పడడానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని పేర్కొంటూ పోలవరం విషయంలో కేంద్రంతో ఏపీ ముఖ్యమంత్రి కుమ్మక్కై చేసిన ద్రోహాన్ని ఆంధ్రజాతి ఖచ్చితంగా గుర్తుంచుకుంటుందన్నారు. పోలవరం పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలని కౌంటర్ వేసేలా అధికారులను ఆదేశించాలని.. కనీసం, కేర్ టేకర్ సీఎంగా అయినా మీ పాపాలకు కొంతమేరకైనా ప్రాయశ్చిత్తం చేసుకోండి.. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో మీరు పూర్తిగా ద్రోహిగా మిగిలిపోతారని హెచ్చరించారు.


పోలవరం నిర్మాణం తన చేతుల్లోకి వస్తే తనకు జరిగే లాభాన్ని గుర్తుతెచ్చుకొని ఏపీ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం చెప్పినదానికల్లా ఒప్పుకున్నారని కేవీపీ ఆరోపించారు. పోలవరం విషయంలో ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్రానికి జరగబోయే నష్టం గురించి హెచ్చరిస్తూ పలు లేఖలు రాశానని.. అయినా వాటిని చంద్రబాబు పట్టించుకోలేదని కేవీపీ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల ఏపీ ముఖ్యమంత్రి అనుభవం హెరిటేజ్ ఆస్తులను, రాష్ట్రానికి అప్పులను పెంచిందని ప్రజలు బహిరంగంగా చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: