ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీపై ఆమాద్మీ పార్టీ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలతో ఇరు పార్టీల మధ్య తీవ్ర దుమారం రేగింది.  ఢిల్లీ నార్త్ ఈస్ట్ లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేజ్రీవాల్... బీజేపీ సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏమీ చేయలేదని విమర్శించారు. మనోజ్ తివారీ ‘‘బాగా డ్యాన్స్ చేస్తారనీ’’.. ప్రజల కోసం ఎలా పనిచేయాలో ఆయనకు తెలియదని కేజ్రీవాల్ అన్నారు.


ఇక తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి దిలీప్ పాండేకు డాన్స్ చేయడం రాదన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... ఆయనకు పని చేయడం మాత్రమే వస్తుందని అన్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ లోక్‌సభకు పోటీపడుతుండగా... ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా దిలీప్ పాండే బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఎంతో కీలకమన్న కేజ్రీవాల్... ప్రజలు పేరు చూసి కాకుండా వారి పనితీరును బట్టి ఓటు వేయాలని కోరారు.


తనపై ఢిల్లీ సీఎం చేసిన వ్యాఖ్యలకు స్పందించిన మనోజ్ తివారీ... ఆయన వ్యాఖ్యలు పూర్వాంచల్ ప్రజలను అవమానించేలా ఉన్నాయని ఆరోపించారు. తర్వాత జరిగే పరిణామాలేంటో అదే ప్రజలు కేజ్రీవాల్‌కి చూపిస్తారు.. అని తివారీ పేర్కొన్నారు. గాయకుడు, నటుడిగా పేరున్న తివారీ రాజకీయాల్లో చేరి ప్రస్తుతం నార్త్ ఈస్ట్ ఢిల్లీ ఎంపీగా కొనసాగుతున్నారు.  మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షీలా దీక్షిత్ రంగంలోకి దిగారు. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు గానూ ఈనెల 12న ఎన్నికలు జరగనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: