ఎన్నిక‌ల ఫ‌లితాలు, పోలింగ్ స‌ర‌ళిపై ఏపీ  ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు స‌మీక్ష‌లు మొద‌ల‌య్యాయి. తొలిరోజు రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మాట్లాడిన చంద్రబాబు... బీజేపీ అనుబంధం, ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయ‌డం, కాంగ్రెస్‌తో దోస్తీ వంటి అంశాల‌ను వివ‌రించారు. ఆంద్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని.. టీడీపీకి నష్టం చేయాలని మోడీ చేయని ప్రయత్నం లేదన్నారు. ఏదో ఒక విధంగా టీడీపీని నష్టపర్చాలనేదే బీజేపీ ధ్యేయం అని అన్నారు.

సరైన సమయంలోనే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో అన్నారు. ప్రధాని మోడీతో ముందే గొడవ పడితే చాలా నష్టపోయేవాళ్లమని, ఏపీ ఓపికగా ఎదురు చూసినా  నిర్లక్ష్యం చేశారనే నింద మోదీకే వచ్చిందని విశ్లేషించారు. కేసీఆర్ కూడా టీడీపీకి నష్టం చేయాలని అనేక ప్రయత్నాలు చేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కుట్రలకు మోడీ, కేసీఆర్ కుతంత్రాలు తోడయ్యాయని అన్నారు. ఎందరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారని అన్నారు. కార్యకర్తలతో మమేకం కావడం,అభిప్రాయాలు సేకరించడం,కలిసికట్టుగా పనిచేయడం టీడీపీకే సాధ్యమని.. టీడీపీ లాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

దేశ ప్రధానికి ఒక రూలు.. సీఎంలకు ఒక రూలా? అని సీఎం చంద్రబాబు ఈసీని ప్రశ్నించారు. తుపాన్‌లు వచ్చినా ముఖ్యమంత్రులు సమీక్షలు చేయొద్దా? అని నిలదీశారు. అదే ప్రధాని అయితే ఏదైనా మాట్లాడొచ్చా.. రాజకీయాలు చేయొచ్చా? అని ప్రశ్నించారు. ప్రధానికి ఏ కోడ్‌ అడ్డు రాదా అని ఈసీ తీరును ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: