ఉత్తరాంద్ర్హలోని 34 సీట్లలో ఈసారి 30 మంది వరకూ పాతవారే తిరిగి పోటీ చేస్తున్నారు. వీరిలో ఈసారి ఎవరు అసెంబ్లీలో మళ్ళీ అడుగుపెడతారన్నది చర్చనీయాంశమైనది. సిట్టింగులనగానే వారికి ఉండే అడ్వాంటేజ్ లతో పాటు, మైనస్ పాయింట్లు కూడా చాలానే ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో   ఈసారి అధికార టీడీపీ, వైసీపీ కూడా సిట్టింగులకు బాగా ప్రాధాన్యత ఇచ్చాయి. ఎన్నికల్లో అనవసర గొడవలు, అసంత్రుప్తులు ఎందుకన్న ఆలోచనతో చంద్రబాబు దాదాపుగా అందరికీ టికెట్లు ఇస్తే,  వైసీపీ  నుంచి తొమ్మిది మంది గెలిచారు అయినా చివరికి అయిదుగురు మిగిలారు. వారు అలా కష్టకాలంలో ఉన్నందుకు గాను బహుమతిగా జగన్ టికెట్లు ఇచ్చారు


ఇక టీడీపీ విషయానికి వస్తే అయిదేళ్ళు పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను చూడకుండా అంతా తామై ఎమ్మెల్యే తమ్ముళ్ళు వ్యవహరించారు. వారు తమ వర్గం, తమ వారు అంటూ గిరిగీసుకుని మరీ  పని చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలను పక్కన పడేశారు. అదే ఇపుడు ఎన్నికల్లో చేటు తెచ్చేలా ఉందని తమ్ముళ్ళు చాలా మంది   వాపోతున్నారు. ఎన్నికలు తోసుకువచ్చేయడంతో అసంత్రుప్తులను చల్లార్చే సమయం బొత్తిగా  లేకుండా పోయింది. దాంతో  పార్టీ కోసం కార్యకర్తలు మనస్పూర్తిగా పనిచేశారా లేక దెబ్బ కొట్టారా అన్నది ఎమ్మెల్యే తమ్ముళ్ళకు  టెన్షన్ గా ఉంది. పట్టుమని పది రోజుల వ్యవధిలోనే  ఎన్నికల ప్రచారం, పోలింగ్ అంతా జరిగిపోయింది. దాంతో క్యాడర్ ని  పూర్తిగా సముదాయించలేకపోయామని ఇపుడు తీరిగ్గా  టీడీపీ సిట్టింగులు బాధపడుతున్నారట.


ఇక వైసీపీ సిట్టింగుల కధ మరోలా ఉంది. ఐదేళ్ళ క్రితం ఎమ్మెల్యేలుగా నెగ్గినా కూడా అధికార పక్షం వివక్ష చూపించింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఓడిపోయిన టీడీపీ నాయకులని ఇంచార్జిలుగా నియమించింది దాంతో వారే అసలైన ఎమ్మెల్యేలుగా చలామణి అయ్యారు. అసలు ఎమ్మెల్యేలు  డమ్మీగా మారారు. తాజా ఎన్నికల్లో తెలివిగా టీడీపీ ఈ ఇంచార్జులనే ఎమ్మెల్యే అభ్యర్ధులుగా నిలబెట్టింది. దాంతో వారు తాము చేసిన పనులను చెప్పుకుని ఓట్లు అడిగారు.
ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి తాము ఏమీ చేయలేకపోయామని వైసీపీ సిట్టింగు ఎమ్మెల్యే అభ్యర్ధులు జనంలో  తమ గోడు చెప్పుకున్నారు. మరి ఓటర్లు వైసీపీ ఎమ్మెల్యేల మొర ఆలకించి సానుకూలంగా ఓట్లు వేశారా లేక, అభివ్రుధ్ధి పనులు చేసిన ఇంచార్జులనే గెలిపించారా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. చూడాలి ఎవరి జాతకం ఎలా  ఉందో ఈవీఎం లను తెరిస్తే కానీ అసలు సంగతి తెలియదు.


మరింత సమాచారం తెలుసుకోండి: