శ్రీకాకుళం ఎంపీ సీటు ఎవరు గెలుచుకుంటారన్నది ఇపుడు పెద్ద చర్చగా గుంది. ఇక్కడ జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే మార్పు తధ్యమన్న భావన వస్తోంది. ఇక్కడ పార్టీల కంటే కూడా కులాలే ఎక్కువ ప్రభావితం చేశాయని అంటున్నారు. శ్రీకాకుళంలో కాళింగుల ప్రాబల్యం ఎక్కువగా  ఉంది. వారు గతంలో చాలా సార్లు ఎంపీలుగా నెగ్గారు. అయితే కింజరపు ఎర్రన్నాయుడు వచ్చిన తరువాత ఈ సీటుని వెలమ సామాజిక వర్గానికి ఖాయం చేసేశారు. ఆయన 1996 నుంచి నాలుగు సార్లు  పదమూడేళ్ల పాటు ఎంపీగా ఉన్నారు. మధ్యలో కేంద్ర మంత్రిగా, రైల్వే స్టాండింగ్ బోర్డ్ చైర్మన్ గా పనిచేశారు. ఇక ఆయన 2009 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధిని కిల్లి క్రుపారాణి చేతిలో ఓడిపోయారు. ఆమె కాళింగ సామాజికవర్గం నాయకు రాలు.
 
 


ఇక ఎర్రన్నాయుడు 2012లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యారు. ఆయన రాజకీయ వారసునిగా వచ్చిన కింజరపు రామ్మోహననాయుడు 2014 ఎన్నికలో తండ్రి సానుభూతి, టీడీపీ గాలి కలసి గెలిచారు. ఇక తాజాగా జరిన ఎన్నికల్లో ఆయన గెలుస్తారా లేదా అన్నది చర్చ సాగుతోంది. ఆయన మీద పోటీగా ఉన్నది కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్. శ్రీనివాస్ పదవులు ఏవీ నిర్వహించకపోయినా రాజకీయంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. 2009 ఎన్నికల్లో టెక్కలి నుంచి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధికి   గట్టి పోటీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకి ముచ్చెమటలు తెప్పించారు.
 


 
ఇక  తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ కి రాజకీయంగా కంటే సామాజికవర్గం పరంగానే గట్టి దన్ను లభిస్తోంది. శ్రీకాకుళం ఎంపీ పరిధిలో కాళింగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా గుత్తమొత్తంగా శ్రీనివాస్ కి మద్దతుగా నిలిచారు. అదే సమయంలో వెలమలు  మొత్తం రామ్మోహననాయుడుకు పనిచేశారు. మిగిలిన రెండు కులాలు చెరి సగంగా చీల్చుకున్నారు. ఈ మొత్తం పోటీలో ఎవరు విజేత అన్నది అంతుపట్టకుండా  ఉంది. రామ్మోహననాయుడు వ్యూహాలతో ముందుకు సాగితే వైసీపీ కుల బలంతో ఢీ కొట్టింది. పార్టీల పరంగా వైసీపీకి అనుకూలంగా గాలి ఉంది. మరో వైపు టీడీపీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఇక్కడ గట్టి పోటీ జరిగిందని అంటున్నారు. ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతోనే బయటపడతారని అంటున్నారు.
 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: