ఆర్కే రోజా.. వైసీపీలోని ప్రధాన నాయకుల్లో ఒకరు.. వైఎస్ జగన్ తరపున అనేక వేదికలపై ఆమె బలంగా గొంతు వినిపించారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఆమెకు మంత్రిపదవి ఖాయం అన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నాయి. 


ఇంకేముంది.. రోజాకు హోం శాఖ ఇస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ వార్తల సంగతి ఎలా ఉన్నా.. రోజాకు మంత్రిపదవి దక్కడం అంత సులభంకాదన్నది కాస్త విశ్లేషిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మంత్రిపదవులు ఇవ్వడం ముఖ్యమంత్రి ఇష్టమే అయినా దానికీ కొన్ని లెక్కలు ఉంటాయి. 

అన్ని ప్రాంతాలకూ.. అన్ని సామాజిక వర్గాలకూ న్యాయం చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన చూస్తే చిత్తూరు జిల్లాలో పార్టీకి బలమైన నేతలే ఉన్నారు. వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారు చిత్తూరు జిల్లా నుంచే ఉన్నారు. ఇందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో మూడు, నాలుగు నియోజకవర్గాల్లో ప్రభావితం చూపించే బలమైన నేత.

కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దాదాపు మంత్రిపదవి ఖాయం అని అంటున్నారు. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తక్కువ వాడేమీ కాదు. పార్టీ గొంతును బలంగా వినిపించినవాడే. కానీ ఒకే జిల్లాలో ఒకే కులం నుంచి రెండు మంత్రిపదవులు ఇవ్వడం కష్టమే. ఒకవేళ ఇచ్చినా.. రెండు మంత్రిపదవులకు ముగ్గురు నేతలు పోటీలో ఉన్నారు.  ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే.. మరి జగన్ ఎవరికి అవకాశం ఇస్తారో..? 



మరింత సమాచారం తెలుసుకోండి: