పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు బాగా కష్టపడుతున్నాడు.. కేంద్రం సహకరించకపోయినా పనులు చేయిస్తున్నాడు..ప్రతి సోమవారం అధికారులతో సమీక్షలు జరుపుతూ చకచకా పని చేయిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండటం వల్లే పోలవరం ఇంత త్వరగా నిర్మాణం జరుగుతోంది.. ఇదీ టీడీపీ నేతలు తరచూ చెప్పే విషయాలు..


కానీ కేవలం చంద్రబాబు స్వార్థం వల్లే తర్వగా పూర్తి కావాల్సిన ప్రాజెక్టు జాప్యం జరుగుతోందని అంటున్నారు ఎంపీ కేవీపీ రామచంద్రరావు.ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు వ్యక్తిగత స్వార్థం, రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంతో లాలూచీతో కొన్నాళ్లు, వైరంతో కొన్నాళ్లు గడపడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగిందని రామచంద్రరావు అంటున్నారు. 

పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయించి పూర్తిగా కేంద్రమే చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం చట్టం చేసిందని కేవీపీ గుర్తుచేశారు.  నీతి ఆయోగ్‌ను పావుగా పెట్టి, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి బాబు స్వప్రయోజనాలే లక్ష్యంగా పోలవరం నిర్మాణం తన చేతుల్లోకి తీసుకున్నారన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం పూర్తి ఖర్చు కేంద్రం భరించేలా ఆదేశించాలని కోర్టును కోరానన్నారు. 

పోలవరం పూర్తి ఖర్చు ముందు రాష్ట్రం తన నిధుల నుండి ఖర్చు చేసి తరువాత కేంద్రం దయదలచి విదిలిస్తే తీసుకోవాల్సిన దుస్థితికి చంద్రబాబే కారణమన్నారు. ఈ ప్రాజెక్టు సందర్శన పేర, ఇతర దుబారా ఖర్చులు, గాలరీ వాక్ పేర కుటుంబ సమేతంగా బాబు చేసిన విహారయాత్రలు కలిపి మొత్తం రూ. 30 వేల కోట్లు ఆర్థిక భారం రాష్ట్రం మోయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేవీపీ ఘాటుగా విమర్శించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: