మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఫొని తుఫాన్ బెంబేలెత్తించింది.  అయితే ఈ ప్రభావం ఉత్తరాంధ్రలో ఎక్కువ చూపించినా మొత్తానికి ఫొనీ భాద తొలగిపోయింది.  ఇక ఫోని తుఫాన్  ఒడిశా వైపు వెళ్లగానే తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారిపోయాయి.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండ బీభత్సం సృష్టిస్తుంది.  సూర్యుడి ప్రతాపానికి జనాలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటలయితే చాలు భానుడి భగభగలు మొదలవ్వడంతో... రోడ్డుపైకి రావాలంటేనే జనాలు భయపడుతున్నారు. గడచిన వారం రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలతో ఉన్న తెలంగాణలో, తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కోస్తాంధ్ర, రాయలసీమల్లో భానుడి భగభగ మొదలైంది. 

ప్రకాశం జిల్లా గుడ్లూరులో 45.3, బాపట్లలో 44, కావలిలో 44.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అనంతపురం వరకూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఏపీలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది.  నెల్లూరు, రాయలసీమలోని తిరుపతి, అనంతపురం, కర్నూలు, చిత్తూరులో కూడా ఇదే పరిస్థితి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తెలంగాణ విషయానికొస్తే... ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్‌ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి.  మిగిలి జిల్లాల్లో కూడా 40 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు ఉండొచ్చంటున్నారు. తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో టెంపరేచర్ పెరిగే అవకాశం ఉందంటున్నారు  మరో రెండు మూడు రోజుల పాటు వడగాల్పులు తప్పవని, తుఫాను ఉత్తరాంధ్రను వీడి వెళ్లగానే, ఉత్తరాది నుంచి తెలంగాణ మీదుగా, కోస్తాంధ్రవైపు వేడి గాలుల రాక మొదలైందని అధికారులు తెలియజేశారు. ఈ కారణంతోనే ఎండలు ఒక్కసారిగా పెరిగిపోయాయని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: