ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్‌వీ సుబ్ర‌హ్మ‌ణ్యంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న్ను టార్గెట్ చేసుకొని వ్య‌వ‌హ‌రిస్తున్న తెలుగుదేశం పార్టీ తాజాగా సంచ‌ల‌న, వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేసింది. సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి అనే అంశాన్ని సైతం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా ఈ త‌ర‌హా విమ‌ర్శ‌లు చేశారు టీడీపీ నేత‌లు.అవయవాల అక్రమ విక్రయాల కేసులో నెల్లూరు సింహపురి ఆసుపత్రి యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి(సీఎస్) ఎల్‌వీ సుబ్రహ్మణ్యం కొమ్ముకాస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్‌సూర్య వివాదాస్ప‌ద ఆరోప‌ణ‌లు చేశారు.


ఉండవల్లి ప్రజావేదిక వద్ద మీడియాతో జూపూడి మాట్లాడుతూ ఆస్పత్రిలో మానవ అవయవాలు అక్రమంగా దొంగిలించి అమ్ముకునే ముఠాకు సీఎస్ అండగా నిలిచారన్నారు. తాత్కాలికంగా నియమితులైన సీఎస్ తనకులేని అధికారాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. శీనయ్య అనే ఓ గిరిజన వ్యక్తి ప్రమాదానికి గురై సింహపురి ఆసుపత్రిలో చేరితే బ్రెయిన్ డెడ్ అయిందని డ్రామాలాడి అవయవాలు అమ్ముకున్నారని ఆరోపించారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగివుందని గమనించిన అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆసుపత్రి యజమాని తరువాత సీఎస్‌ను కలిసిన అనంతరం కథ అంతా మారిందని ఆరోపించారు. ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన నివేదికను చెత్త బుట్టలో వేసిన సీఎస్‌కు ఈ వ్యవస్థపై ఎంత గౌరవం ఉందో తెలుస్తోందని విమర్శించారు. ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి ఆదేశాలతో సీఎస్ తిరిగి నివేదిక కోరారో తేల్చాలన్నారు. సీఎస్‌గా ఎక్కువ కాలం ఉండనని తెలిసి ఇల్లు చక్కదిద్దుకుంటున్నారని, మానవ అవయవాలను అక్రమంగా అమ్ముకునే వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.


ఆనంద్‌సూర్య మాట్లాడుతూ ఓ వర్గంతో సీఎస్ కుమ్మక్కయి వారి ప్రయోజనాల కోసం పావులు కదుపుతున్నారని ఆరోపించారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తన సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారని ఆక్షేపించారు. మానవత్వాన్ని మంటగలిపే విధంగా వ్యవహరిస్తున్న సింహపురి ఆసుపత్రి యాజమాన్యానికి సీఎస్ అండగా నిలవటం దుర్మార్గమన్నారు. ఇలాగే పనిచేస్తే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వంలో సీఎస్ ఓ ఉద్యోగి మాత్రమే అని ఎన్నికైన ప్రభుత్వానిదే అంతిమంగా నిర్ణయాధికారమని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: