రాజకీయాల్లో ఎందరో స్పూర్తిగా ఉన్న్నారు. డెబ్బయ్యేళ్ల భారతావనిలో ఎందరో మహానుభావులు ప్రజా జీవితంలో గొప్ప విలువలు నెలకొల్పారు. వారి బాటన నడుస్తామని ఇపుడు ఎవరూ అనడంలేదు. ఎందుకంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని, నైతిక ప్రమాణాలు పాటించడం అంటే ఎవరికీ గిట్టదు కూడా. మరి రాజకీయంగా వర్తమాన భారతానికి మరి  కొంతమంది ఆదర్శంగా ఉన్నారు. వారిని చూసి నవీన తరం తామూ అలాగే కాకూడదా అనుకుంటోంది.


చిత్రమేంటంటే వారిద్దరూ తండ్రీ కొడుకులు. వారే కర్ణాటకకు చెందిన జేడీఎస్ అధినేతలు. వారే మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి. ఈ ఇద్దరు రాజకీయాల్లో ఇంతలా ఆదర్శంగా మారడానికి కారణాలు ఏంటి అంటే ఒక్కసారి గత చరిత్రను, వర్తమాన రాజకీయాన్ని తెలుసుకుంటే అర్ధమైపోతుంది. అది 1996 సంవత్సరం. అప్పట్లో దేశంలో పీవీ పాలన అంతమైంది. కొత్తగా ఎన్నికలు జరిగాయి.


కాంగ్రెస్ ఓడిపోయింది. అతి పెద్ద పార్టీగా 166కి పైగా ఎంపీ సీట్లు తెచ్చుకుని బీజేపీ నిలిచింది. తొలిసారి వాజ్ పేయి ని ప్రధానిగా అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ పిలిచారు. పట్టుమని పదమూడు రోజుల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తరువాత కాంగ్రెస్ వెనక నుండి మద్దతు ఇచ్చి కర్నాటకలో ముఖ్యమంత్రిగా ఉన్న దెవెగౌడను తెచ్చి ప్రధానిగా చేసింది. ఆ ఎన్నికల్లో దేవెగౌడ పార్టీకి వచ్చిన సీట్లు పెద్దగా లేవు. అయినా ఆయన దేశానికి పదకొండు నెలల పాటు ప్రధాని అయిపోయారు.


సీన్ కట్ చేస్తే 2018 కర్నాటకలో  అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తామే కింగులమని అనుకున్నారు. అయితే చిత్రంగా హంగు వచ్చింది. బీజేపీ మెజారిటీకి కొద్ది దూరంలో ఉండిపోయింది. అంతే కాంగ్రెస్ మళ్ళీ తన 1996 నాటి ప్లాన్ బయటకు తీసింది. దేవెగౌడ కుమారుడు కుమారస్వామిని సీఎం ని చేసి తానూ అందులో చేరింది. బీజేపీని పక్కన పెట్టేసింది. ఈ ఎన్నికల్లో కుమారస్వామి పార్టీకి వచ్చిన సీట్లు కేవలం 38 మాత్రమే.


ఈ రెండు సంఘటలు చూసిన వారు అంతా తామెందుకు  దేవెగౌడలా ప్రధాని కాకూడదు, తామెందుకు  కుమారస్వామిలా ముఖ్యమంత్రి అవకూడదు అని కలలు కంటున్నారు. ఒకే కుటుంబంలో రెండు మార్లు అద్రుష్టం తగలడం వర్తమాన రాజకీయాల్లో అరుదు. దీన్ని లక్కు అనాలా లేక అవకాశ వాద రాజకీయాలు దారుణంగా  పెరిగిపోయాయి అనాలో తెలియదు కానీ మొత్తానికి తండ్రీ కొడుకులు ఉన్నతమైన పదవులు అధిష్టించారు. దాన్ని చూసి రేపటి రోజున కేంద్రంలో ప్రధాని పదవి దక్కకపోతుందా అని దాదాపు అరడజను మందికి పైగా ఇపుడు క్యూలో వేచి చూస్తున్నారు.


అదే తీరుగా ఏపీలోనూ హంగు వస్తే రొట్టె విరిగి నేతిలో పడకపోతుందా, తామే సీఎం సీటు పట్టేయలేకపోతామా అని ఇక్కడా కొన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. కుమారస్వామి ఫార్ములా ఇపుడు దేశానికే ముఖ్యమంత్రి రేసులో ఉన్నవారికి  ఆదర్శమైతే, దేవెగౌడ లక్కును దక్కించుకోవడానికి ప్రధాని రేసులో ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేతల్లో పోటీ మొదలైంది. మరి ఇది మంచిదా చెడ్డదా అనే దాని కంటే ఇదే ఆదర్శమంటున్న రాజకీయానికి మాత్రం జోహార్ అనక తప్పదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: