ఏపీలో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీ అభ్య‌ర్థుల‌ను ఓడించేందుకు ఈ సారి సొంత పార్టీ నేత‌లు కంక‌ణం క‌ట్టుకున్నారు. పార్టీలో ఎప్ప‌టి నుంచో తిష్ట‌వేస్తోన్న సీనియ‌ర్ల‌ను త‌ప్పించి ఈ సారి కొత్త వారికి పోటీ చేసే అవ‌కాశం ఇస్తారిన చాలా మంది భావించారు. అయితే చంద్ర‌బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందిని త‌ప్పించేందుకు సాహ‌సించ‌లేదు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ద‌శాబ్దాలుగా తిష్ట‌వేసిన వారిని, అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్న‌వారిని అలాగే కంటిన్యూ చేశారు. ఇక కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సీట్లు ఆశించిన ఇద్ద‌రు, ముగ్గురు నేత‌ల్లో ఒక‌రికి సీటు వ‌స్తే మ‌రొక‌రు స‌హ‌క‌రించ‌క... ప్ర‌త్య‌ర్థి పార్టీకి అనుకూలంగా ప‌నిచేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.


2004లో అప్ప‌ట్లో అధికారంలో ఉన్న టీడీపీ చాలా చోట్ల చిత్తుగా ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం టీడీపీ సీనియ‌ర్ల మ‌ధ్య ఉన్న అంత‌ర్గ‌త క‌ల‌హాలు, వెన్నుపోటు రాజ‌కీయాలే. ఇక ఇప్పుడు ఐదేళ్లు అధికారంలో ఉన్నా చాలా మంది సీనియ‌ర్ల మ‌ధ్య పొస‌గ‌ని ప‌రిస్థితి ఉంది. ఇక తాజాగా ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేందుకు మ‌రో 15 రోజుల‌కు పైగా స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పోటీ చేసిన అభ్య‌ర్థుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మీక్ష‌ల్లో ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థుల‌కు సొంత పార్టీ నేత‌లే వెన్నుపోట్లు పొడిచిన అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ విష‌యంపై ఇప్ప‌టికే చంద్ర‌బాబుకు నివేదిక‌లు చేర‌డంతో ఆయ‌న సైతం వీటిని ప్ర‌స్తావిస్తూ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత తానే స్వ‌యంగా వీటిపై చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని చెపుతున్నారు.


ఇక తాజాగా జ‌రిగిన రాజ‌మ‌హేంద్ర‌వ‌రం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ పార్టీ నేత‌ల స‌మీక్ష‌లో ఆ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ అభ్య‌ర్థి వంగ‌ల‌పూడి అనిత‌కు వ్య‌తిరేకంగా సొంత పార్టీ నేత‌లే కుట్ర‌లు ప‌న్నిన‌ట్టు తేలింది. చంద్ర‌బాబు అనిత‌ను కావాల‌ని కొవ్వూరు నుంచి పోటీ చేయిస్తే ఆమెను అక్క‌డ ఓడించేందుకు కొంద‌రు విప‌క్ష పార్టీ వాళ్ల‌కు స‌హ‌క‌రించార‌ట‌. అనిత అసెంబ్లీలో గ‌ట్టిగా మాట్లాడ‌డంతో పాటు విప‌క్షాల‌పై విరుచుకు  ప‌డే వారు. ఈ సారి పాయ‌క‌రావుపేట‌లో ఆమెను సొంత పార్టీ నేత‌లే వ్య‌తిరేకించ‌డంతో ఆమె ఎలాగైనా అసెంబ్లీలో ఉండాల‌ని చంద్ర‌బాబు ప‌ట్టుబ‌ట్టి కొవ్వూరుకు పంపారు. ఆమె నాన్‌లోక‌ల్ కావ‌డంతో ఈ సారి ఆమెకు షాక్ త‌ప్పేలా లేదు.

ఇక రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సిటీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ పార్టీ అభ్య‌ర్థి ఆదిరెడ్డి భ‌వానీకి వెన్నుపోట్లు త‌ప్ప‌లేద‌ట‌. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ మేయర్‌ పంతం రజనీ శేషసాయి తెలుగుదేశం పార్టీ విజయానికి ఏ మాత్రం పని చేయలేదని పార్టీ నేతలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై చంద్ర‌బాబు స్పందిస్తూ ఈ విష‌యాల‌న్ని త‌న‌కు తెలుసు అని... ఎన్నిక‌లు అయ్యాక దీనిపై మాట్లాడ‌తాన‌ని చెప్పారు. ఇక రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కొంద‌రు సొంత పార్టీ నేత‌లే టీడీపీ అభ్య‌ర్థికి వ్య‌తిరేకంగా ప‌నిచేసిన విష‌యాలు కూడా బాబు దృష్టికి తీసుకువ‌చ్చారు. ఏదేమైనా ఈ సారి చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీని టీడీపీ వాళ్లే ఓడించేందుకు ప‌నిచేసిన‌ట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలోనూ కొన్ని చోట్ల కొంద‌రు ఎమ్మెల్యే అభ్య‌ర్థులు ఎమ్మెల్యే ఓటు మాకు.. ఎంపీ ఓటు మీ ఇష్టం అని ప్ర‌చారం చేసుకున్న‌ట్టు కూడా అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: