మే 23 వ తేదీ ఎన్నికల ఫలితాల అనంతరం మీలో కొలువుదీరే కొత్త ప్రభుత్వం, మంత్రివర్గం, ఇతర‌త్రా అంశాలపై తూర్పుగోదావరి జిల్లాలో అప్పుడే ఆసక్తికర రాజకీయ చర్చలు ప్రారంభమయ్యాయి. ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు ఏ పార్టీ అయినా తూర్పుగోదావరి జిల్లా కీలకం. 19 నియోజకవర్గాలతో రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్నా తూర్పుగోదావరి జిల్లాలో మెజార్టీ సీట్లు వస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మార్గం చాలా వరకు సుగమం అయినట్లే. ఇక ఏపీలో ఎన్నికలు ముగిశాక వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీ నేతలు అప్పుడే తమకు కొత్త క్యాబినెట్‌లో మంత్రి పదవి వస్తుందని ఆశల పల్లకిలో విహరిస్తున్నారు.  ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా వైసీపీ నేతలు కూడా అప్పుడే తమకు జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి ఖాయమని చర్చల్లో మునిగి తేలుతున్నారు. 


ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా గా ఉన్న తూర్పుగోదావరిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మూడు మంత్రి పదవులు ఇవ్వడం ఆనవాయితీగా ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం సైతం అతి పెద్ద జిల్లాగా ఉన్న ఈ జిల్లా నుంచి మూడు మంత్రి పదవులు ఇచ్చేది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ఈ జిల్లాకు రెండు మంత్రి పదవులతో సరిపెట్టింది. చంద్రబాబు కేబినెట్‌లో గత ఎన్నికల తర్వాత మంత్రులుగా ఉన్న నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు చివరి వరకు మంత్రులుగా కంటిన్యూ  అయ్యారు. మ‌ధ్య‌లో ప్ర‌క్షాళ‌న జ‌రిగిన‌ప్పుడు తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి ఎలాంటి మార్పులు, చేర్పులు చెయ్య‌లేదు.  ఇక వైసీపీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా కొత్తముఖాల‌ను మంత్రివర్గంలో చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా వైసిపి వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం కాపు సామాజిక వర్గం నుంచి దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు రేసులో ఉన్నారు. 


బీసీల్లో జిల్లాలోనే ఎక్కువగా ఉన్న శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ లేదా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణల‌లో ఒకరికి అవకాశం రావచ్చు. ఎస్సీ సామాజికవర్గం నుంచి  మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కు ఛాన్స్ ఉంది. ఇక వీరికి మంత్రి పదవులు లభించడం అనేది వీరి గెలుపోటములపై కూడా ఆధారపడి ఉంది. ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్ మండపేట నుంచి పోటీ చేశారు. వాస్తవంగా చూస్తే జగన్ కోసం తన మంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని వదులుకున్నా బోస్‌కు ఈ సారి జగన్ కేబినెట్‌లో గ్యారెంటీగా బెర్త్ ద‌క్కాలి. అయితే మండ‌పేటలో ఆయ‌న ఎంత ? వ‌ర‌కు గెలుస్తార‌న్న‌ది చెప్ప‌లేని ప‌రిస్థితి. ఏదేమైనా ఈ అంచ‌నాలు ఎలా ఉన్నా ఫైన‌ల్‌గా జ‌గ‌న్ తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి త‌న కేబినెట్‌లో ఎవ‌రికి బెర్త్‌లు ఇస్తారో ? చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: