తెలంగాణలో మ‌రో ఎన్నిక‌ల సంద‌డి సాగ‌నుంది.  జిల్లా పరిషత్, మండల పరిషత్ తొలి విడుత ఎన్నికలకు సర్వం సిద్దమైంది. 197 జెడ్పీటీసీ స్థానాలు, 2,166 ఎంపీటీసీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది.  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం పోలింగ్‌ను సాయంత్రం 4గంటల వరకే అధికారులు పరిమితం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు,  కొమరం భీం అసిఫాబాద్ జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తొలివిడుత  పరిషత్ ఎన్నికలకు .. ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.


ఈ పోలింగ్‌లో భాగంగా, ఎంపీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్, జడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు వాడుతున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈసారి ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలుకు సిరా చుక్క పెట్టనున్నట్లు తెలిపింది. టీవీలు, రేడియోల్లోనూ ప్రచారం నిషేధించింది. తొలి విడత పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో స్థానికేతరులు ఉండరాదని సూచించింది. ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు ఆయా ప్రాంతాలను వదలి వెళ్లాలని ఆదేశించింది. మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో.. ఎన్నికలు ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేశారు.పరిషత్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు, ఇతర వస్తువులు పంపిణీ చేసేవారిపై నిఘా పెడుతున్నారు. పోలీసులు ఇప్పటి  వరకు నిర్వహించిన తనిఖీల్లో  76 లక్షల 40 వేల రూపాయల నగదు,  30 లక్షల విలువచేసే వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 95 మందిపై కేసులు నమోదుచేశారు. 


తొలి విడతలో మొత్తం 2166 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. 69 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 2097 స్థానాల్లో పోలింగ్‌ నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ విడతలో 197 జడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్‌  ఇవ్వగా, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమయ్యాయి. దీంతో 195 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 27న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న నేప‌థ్యంలో, ఫ‌లితాల‌పై స‌ర్వత్రా ఉత్కంఠ నెల‌కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: